ఆర్టీసీ బస్సు ముందు విద్యార్థుల ధర్నా
రాజాం: కళాశాలలు, పాఠశాలలకు వెళ్దామంటే బస్సులు ఆపడంలేదు... అప్పటికే ఫుల్ అయిపోయాయన్న నెపంతో ముందుకు పోనిస్తున్నారు... గంటల తరబడి రోడ్డుపైనే నిల్చోవాల్సి వస్తోంది... సకాలంలో విద్యాలయాలకు చేరుకోలేకపోతున్నాం... గతంలో ఉన్న బస్సు సర్వీసులు కూడా ఇప్పుడు లేవు... పాస్‌లు తీసుకున్నా ప్రజయోజనం లేదు.. ఇదెక్కడి అన్యాయం..? విద్యార్థులు చదువుకోవద్దా... ఫీజురీయింబర్స్‌మెంట్ లేదు.. వసతిగృహాల్లో నాణ్యమైన భోజనాలు పెట్టరు.. ఇంత ఘోరం ఎన్నడూ లేదు... విద్యార్థుల బస్సు కష్టాలు తీర్చాలని, అదనపు సర్వీసులు నడపాలని కోరుతూ రాజాం–శ్రీకాకుళం రోడ్డులోని పొగిరి సెంటర్‌లో విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి చంద్రబాబు సర్కారు తీరుపై నిరసన తెలిపారు. బస్సులు నిలుపుదల చేయపోవడంపై ఆర్టీసీ బస్సు డ్రైవర్లను నిలదీశారు. సీ్త్రశక్తి పథకం పెట్టిన ప్రభుత్వం అందుకు తగ్గ బస్సులు నడపకపోవడం వల్లే విద్యార్థులకు ప్రతిరోజూ కష్టాలు ఎదురవుతున్నాయంటూ వాపోయారు. ఆర్టీసీ సర్వీసులు తగ్గడం వల్లే ఈ సమస్య ఉందని ఆర్టీసీ సిబ్బంది చెప్పడంతో విద్యార్థులు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. పొగిరి కూడలి నుంచి రాజాం మండలం పొగిరి, జి.సిగడాం మండలం పెంట, సీతంపేట, గేదెలపేట, జి.సిగడాం, లింగాపురం ప్రయాణికులు, విద్యార్థులు అటు శ్రీకాకుళం, ఇటు రాజాం, మరో వైపు జి.సిగడాం ప్రయాణిస్తారని, ఇక్కడ బస్సులు నిలుపుదల చేయకపోవడం విచారకరమన్నారు. బస్సులు నిలుపుదల చేయకపోవడంతో తిరిగి ఇంటికి వెళ్లిపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. సమస్య పరిష్కరించేవరకు ఆందోళన విరమించేది లేదని తేల్చిచెప్పారు. సమాచారం అందుకున్న రాజాం పట్టణ సీఐ డి.నవీన్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యార్థులతో మాట్లాడారు. రాకపోకల సమస్య పరిష్కరిస్తేనే ఆందోళన విరమిస్తామని విద్యార్థులు స్పష్టంచేయడంతో ఆర్టీసీ అధికారులతో మాట్లాడారు. ఆర్టీసీ సర్వీసులు ఉదయం, సాయంత్రం సమయాల్లో పెంచడంతో పాటు ప్రతి ఆర్టీసీ బస్సును విద్యార్థుల కోసం పొగిరి కూడలిలో నిలుపుదచేయాలని, ఎంత రద్దీగా ఉన్న బస్సును ఆపాలని కోరారు. దీనికి ఆర్టీసీ ఉన్నతాధికారులు అంగీకరించడంతో నిరసన కార్యక్రమం తాత్కాలికంగా సద్దుమణిగింది.
బ
ఆర్టీసీ బస్సులు నిలుపుదల
చేయకపోవడంపై ఆందోళన
పొగిరి సెంటర్‌లో ధర్నా
రోడ్డుపై బైఠాయించి నిరసన
నిలిచిన రాకపోకలు
పోలీసులు సర్దిచెప్పడంతో
శాంతించిన విద్యార్థులు


