విజయనగరం ఫోర్ట్: పంటల బీమా నమోదు పక్రియను ఈ నెల 15వ తేదీలోగా పూర్తిచేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులకు సూచించారు. పంటల బీమా, ఈ–క్రాప్ నమోదు, ఎరువుల పంపిణీపై అధికారులతో టెలికాన్ఫరెన్స్‌లో బుధవారం మాట్లాడారు. ఎరువుల కొరత, అక్రమ నిల్వలు, అధిక ధరలకు విక్రయాలు జరగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో వర్షపాతం లోటు, నీటి లభ్యత తగ్గే ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటలు ప్రోత్సహించాలన్నారు.
నేటి నుంచి డైట్‌లో రెండో విడత కౌన్సెలింగ్
నెల్లిమర్ల: డీఈఈసెట్–26లో అర్హత సాధించిన వారికి వేణుగోపాలపురంలోని డైట్‌లో రెండో విడత కౌన్సెలింగ్, వెబ్ ఆప్షన్‌ల నమోదు ప్రక్రియ ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు నిర్వహిస్తామని ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రామకృష్ణారావు బుధవారం తెలిపారు. అభ్యర్థులు నమోదుచేసిన వెబ్ ఆప్షన్ల ఆధారంగా ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు సీట్ల కేటాయింపు ప్రక్రియ సాగుతుందన్నారు. ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు సంబంధిత ప్రభుత్వ డైట్ కళాశాలలో ఒరిజినల్ సర్టిఫికెట్లను సమర్పించి, ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తుది ప్రవేశపత్రం పొందాలన్నారు. డీఎల్‌ఎడ్ మొదటి సంవత్సరం తరగతులు ఈ నెల 27 నుంచి ప్రారంభమవుతాయని చెప్పారు.
కార్మికుల పిల్లలకు ఉచిత స్కిల్ శిక్షణ
విజయనగరం గంటస్తంభం: డిగ్రీ, డిప్లమా, బీటెక్, తదితర కోర్సులు చదువుతున్న భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇండస్ట్రీ రెడీ ఆన్‌లైన్ స్కిల్ అప్‌గ్రేడేషన్ ట్రైనింగ్ ప్రొగ్రాం నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి బుధవారం తెలిపారు. దీనికి సంబంధించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఉచిత శిక్షణలో చేరి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రీ–రికార్డెడ్ వీడియోల ద్వారా ఇంటి నుంచే మొబైల్‌లో శిక్షణ పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ సుజాత, అధికారులు, శిక్షణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
14న తిరంగా ర్యాలీ
విజయనగరం గంటస్తంభం: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 14న జిల్లా స్థాయిలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించనున్నట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 7.30 గంటలకు కోట కూడలి నుంచి ర్యాలీ ప్రారంభమై మూడు లాంతర్లు మీదుగా గంటస్తంభం వరక కొనసాగుతుందన్నారు. ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా 150 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శిస్తామని చెప్పారు. ర్యాలీలో అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
కాలువ కాదు రోడ్డే..!
సీతంపేట: ఈ చిత్రంలో కనిపిస్తున్నది కాలువ అనుకుంటే పొరబడినట్లే. ఇది వంబరెల్లి రహదారి దుస్థితి. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు కొట్టుకుపోయి ఇలా తయారైంది. పలుమార్లు ఇంజినీరింగ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోయిందని గిరిజనులు వాపోతున్నారు. ఈ రహదారిపై ప్రయాణం నరకప్రాయమని ఆవేదన వెళ్లగక్కుతున్నారు. గిరిజనులు తమ అటవీఉత్పత్తులను విక్రయాలకు తీసుకువెళ్లాలన్నా, రోగులను ఆస్పత్రికి తరలించాలన్నా అవస్థలు పడాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


