● డ్రైవర్లు, కండక్టర్లకు అవగాహన, శిక్షణ తరగతులు
విజయనగరం అర్బన్: ఏపీఎస్ ఆర్టీసీ జిల్లా పరిధి లో ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు ‘ప్రమాద రహిత వారోత్సవాలు’ నిర్వహించనున్నట్టు జిల్లా ప్రజా రవాణా అధికారి జి.వరలక్ష్మి తెలిపారు. ప్రయాణికుల సురక్షిత ప్రయాణమే ధ్యేయంగా ఈ వారోత్సవాలు చేపడుతున్నట్లు ఆమె వెల్లడించారు. జిల్లాలోని ప్రతి ఆర్టీసీ డిపోలోనూ రోజువారీగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. రోడ్డు భద్రతపై సిబ్బందికి మరింత స్పష్టత ఇచ్చేందుకు కండక్టర్లు, డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ తరగతులు ఇస్తామన్నారు. ప్రమాద రహిత ప్రయాణమే లక్ష్యమన్నారు.


