● మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
విజయనగరం రూరల్: నేటి విద్యార్థులకు ఇతిహాసాలను తెలియజేసి వారిలో నైతిక విలువలు పెంపొందించేలా బోధన సాగించాలని భారత మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. జిల్లా కేంద్రంలోని రామనారాయణంలో ఉన్న వాల్మీకి రీసెర్చ్ సెంటర్, ఏకాగ్ర అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో 1 నుంచి 6 తరగతుల విద్యార్థుల కోసం రామాయణంపై ప్రత్యేకంగా రూపొందించిన పుస్తక శ్రేణిని హైదరాబాద్‌లో తన నివాసంలో శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతృభాష, భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని తెలిపే ఇటువంటి పుస్తకాలు దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది పిల్లలకు, పాఠశాలలకు చేరువకావాలని ఆకాంక్షించారు. రామాయణంలోని గొప్ప నీతిని ఈనాటి తరగతి గది బోధనకు తగినట్లుగా ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగిందని నిర్వాహకులు, ఎన్సీఎస్ ప్రతినిధులు ఆయనకు వివరించారు. తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో, సులభంగా అర్ధమయ్యే భాషలో రూపొందించిన ఈ పుస్తకాలను విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంలోని పాఠశాలలకు అందిస్తామన్నారు.
బీఎన్‌ఆర్ గోల్డ్, డైమండ్స్ షోరూమ్ ప్రారంభం
బీచ్‌రోడ్డు: బీఎన్‌ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ తన ఐదో షోరూమ్‌ను విశాఖపట్నంలోని శ్రీ సంపత్ వినాయక ఆలయ ప్రాంగణంలో శుక్రవారం ప్రారంభించింది. నూతన షోరూమ్‌ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావు ప్రత్యేక అతిథిగా పాల్గొని సంస్థ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రారంభోత్సవానికి ప్రముఖ సినీ నటి సంయుక్త మీనన్ హాజరై షోరూమ్‌ను సందర్శించారు. బంగారు, వజ్రాభరణాలను పరిశీలించి అభిమానులతో కలిసి ఫొటోలు దిగారు. ప్రారంభోత్సవం సందర్భంగా వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను సంస్థ ప్రకటించింది. బంగారు ఆభరణాలపై మేకింగ్ చార్జీలు 0 శాతం, బంగారు ఆభరణాల తరుగుపై 3 నుంచి 9 శాతం వరకు, డైమండ్ ఆభరణాల తరుగుపై 25 శాతం వరకు తగ్గింపు కల్పిస్తున్నట్లు తెలిపింది. డైమండ్ ఆభరణాలు ప్రతి క్యారెట్ రూ.46,999 నుంచి అందుబాటులో ఉంటాయని పేర్కొంది. అలాగే అన్ని రకాల కొనుగోళ్లపై జీఎస్టీని సంస్థే భరిస్తుందని వెల్లడించింది. ఈ సందర్భంగా బీఎన్‌ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ చైర్మన్ నాగిరెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ రోహిత్ చరణ్ రెడ్డి మాట్లాడుతూ విశాఖ ప్రజల ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు. నాణ్యమైన ఆభరణాలు, మెరుగైన సేవలను అందించేందుకు కట్టుబడి ఉంటామని చెప్పారు.


