విజయనగరం అర్బన్: పాఠశాల విద్యలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నామని, తల్లిదండ్రులను భాగస్వాములను చేస్తున్నామని కూటమి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసిన ‘మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్’ క్షేత్రస్థాయిలో తీవ్ర గందర గోళానికి, అవస్థలకు వేదికగా మారింది. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నిర్వహించిన ఈ వేడుకల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలను సేవకులుగా మార్చేయడం విమర్శలకు దారితీసింది. ఒకవైపు ఘనంగా నిర్వహించాలని హుకుం జారీ చేసిన విద్యాశాఖ... అందుకు తగ్గట్టుగా నిధులు కేటాయించకపోవడంతో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బడుల్లో కుర్చీలు మోయడం, షామియానాలు వేయడంలో సహాయపడడం, పెద్దలకు నీళ్లు అందించడం, ప్రాంగణాలను శుభ్రం చేయడం... ఇలా అన్ని పనులనూ పిల్లలతోనే చేయించడం పలు పాఠశాలల్లో కనిపించింది. చుదువుకోవడానిక, తమ ప్రతిభను ప్రదర్శించడానికి బడికి వచ్చిన పిల్లలను రోజంతా బరువులు మోయించి, సేవకులుగా మార్చడంపై పలువురు తల్లిదండ్రులు మండిపడ్డారు. మరోవైపు పీటీఎంల నిర్వహణకు అరకొర నిధులు కేటాయించడంతో ఉపాధ్యాయుల చేతిచమురు వదిలింది. సమావేశాల నిర్వహణకు అయ్యే ఖర్చును నిజాయితీగా కేటాయించకపోవడం వల్లే ‘మెగా పేరెంట్స్ డే’ కాస్తా ‘మెగా ప్రహసనం’గా మారిందని ఉపాధ్యాయ లోకం నిట్టూర్చుతోంది.
క్షేత్రస్థాయిలో టీచర్ల ఆవేదన
‘మా జీతాల్లోంచే ఖర్చు చేయాలా?’, ‘ప్రభుత్వం ఇచ్చిన నిధులు కనీసం కుర్చీల అద్దెకు, మైక్ సెట్‌కే సరిపోవు. ఇక ఊరందరికీ భోజనాలు పెట్టాలంటే వేల రూపాయలు కావాలి. హంగామా చేయమని ఉత్తర్వులు ఇస్తారు కానీ నిధులు ఇవ్వరు. పరువు కోసం మేమే సొంత డబ్బులు వేసుకుని కార్యక్రమం పూర్తి చేశాం. ప్రతిదానికి ఉపాధ్యాయులనే బలిచేయడం ఏంటి?’
– పేరుచెప్పేందుకు ఇష్టపడని ఓ ప్రాథమికోన్నత పాఠశాల హెచ్‌ఎం ఆవేదన ఇది


