విజయనగరం గంటస్తంభం:
ప్రజల సొమ్ముతో నిర్మితమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ)ని ప్రైవేటీకరించే ప్రయత్నాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్మి బుగత అశోక్ డిమాండ్ చేశారు. ఆర్టీసీని బలహీనపరిచి ప్రైవేటు సంస్థలకు అప్పగించే చర్యలు కొనసాగితే రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం విజయనగరం ఆర్టీసీ డిపో ఎదుట ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ, ఇప్పటికే అద్దె బస్సుల విధానంతో ప్రైవేటీకరణకు ప్రభుత్వం మార్గం సుగమం చేసిందని, ఇప్పుడు విద్యుత్ బస్సుల కొనుగోలు, నిర్వహణను కూడా ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేస్తోందని విమర్మించారు. విద్యుత్ బస్సులను పూర్తిగా ఆర్టీసీ ద్వారానే కొనుగోలు చేసి నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. కోట్ల రూపాయల విలువైన ఆర్టీసీ భూములు, ఆస్తులను తక్కువ ధరలకు లీజుల పేరుతో ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నాలను నిలిపివేయాలని కోరారు. ఆర్టీసీ కొత్త బస్సుల కొనుగోలు నిలిచిపోవడం, ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగుల స్థానంలో నియామకాలు చేపట్టకపోవడంతో సంస్థ తీవ్ర సిబ్బంది కొరతను ఎదుర్కొంటోందన్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు చెల్లించడం, పే రివిజన్ అమలు చేయడం, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనాలు, సామాజిక భద్రత కల్పించడం వంటి డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎస్.రంగరాజు, జిల్లా కార్యదర్మి కె.వి.రమణ, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.


