సంతకవిటి మండలం మామిడిపల్లి సమీపంలో బిందెలతో నీటిని వరినారు తడిపేందుకు మోస్తున్న మహిళలు
రాజాం: ఖరీఫ్‌లో వరి సాగు కార్తెలు ఒక్కొక్కటిగా వెళ్లిపోతున్నాయి. వాతావరణం వేసవిని తలపిస్తోంది. తొలకరిలో వర్షాలు కురవాల్సిన సమయంలో ఎండలు కాస్తున్నాయి. చినుకులు రాలకుండానే మేఘాలు తేలిపోతున్నాయి. ఖరీఫ్ సాగుకు సిద్ధమైన రైతన్నకు ఆదిలోనే ఇబ్బందులు ఎదురయ్యాయి. పొలాల్లో వేసిన వరి విత్తనాలు మొలకెత్తలేదు. కొన్నిచోట్ల మెలకెత్తినా నీరు అందక ఎండిపోతోంది. నాట్లు వేయాల్సిన సమయంలో నారుమడులు తడపాల్సి రావడంతో రోజురోజుకు రైతుల ఆశలు సన్నగిల్లుతున్నాయి. వరి నారును బతికించుకునే దారిలేక కన్నీరుపెడుతున్నారు. కొన్నిచోట్ల ఇంటిల్లిపాది దగ్గర్లోని బావులు, చెరువుల నుంచి నీటిని బిందెలు, ఇంజిన్ల సాయంతో పొలాలకు తరలించి నారుమడులను తడుపుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
కాలువలు ఉన్నా ఫలితం సున్నా..
ఉమ్మడి విజయనగరం జిల్లాలో నాగావళి, సువర్ణముఖి, వేగావతి, గోస్తనీ, చంపావతి నదులు ఉండగా, వీటికి సంబంధించి తాటిపూడి, వేగావతి, ఒట్టిగెడ్డ, పారాది, వెంగళరాయ, గొర్లె శ్రీరాములునాయుడు మడ్డువలస ప్రాజెక్టు, నారాయణపురం ఆనకట్ట, తోటపల్లి, తదితర ప్రాజెక్టుల నుంచి సాగునీరు అందే పరిస్థితి కనిపించడంలేదు. నదుల్లో నీరులేకపోవడంతో ప్రాజెక్టుల నుంచి సాగునీరు విడుదలకు అధికారులు వెనుకంజవేస్తున్నారు. కనీసం నారుమడులు, వెద పొలాలు తడిపేందుకు ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నా స్పందన కరువైంది. ప్రభుత్వం రైతుల కష్టాలను పట్టించుకోవడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
పంటలు మొత్తం ఎండిపోయాయి
ఈ ఖరీఫ్‌లో ఏ పంట సాగుచేయలేని పరిస్థితి ఉంది. వరి నారు ఎండిపోయింది. మొక్కజొన్న పూర్తిగా పాడయ్యింది. పంట నష్టం వస్తుందంటే ఉచిత పంటల బీమాను ఎత్తేశారు. రైతు కుటుంబాలు ఎలా బతకాలో అర్థంకాని పరిస్థితి.
– టంకాల సూరపినాయుడు, రైతు, లక్ష్మీపురం, రాజాం మండలం
కాలువలు ఉన్నా నీరు రాదు
సాగునీటి కాలువలు ఉన్నా నీరు రాదు. అతి వృష్టి, అనావృష్టి మాదిరిగా ఉంటుంది. వరినారు బతికించుకునేందుకు నీరు లేకుంటే పంటలు ఎలా పండించుకోవాలి. మడ్డువలస, తోటపల్లి కాలువలు అధికారులు ఎక్కడ ఉంటారో ఎవరికీ తెలియదు. ప్రతికూల వాతావరణం రైతుకు కోలుకోలేని నష్టాన్ని మిగిల్చింది.
– పతివాడ రాంబాబు, రైతు, సిరిపురం,
సంతకవిటి మండలం
ఎల్‌నినోపై అప్రమత్తత ఏది?
జిల్లాలో ఏటా సగటున 1.03 లక్షల నుంచి 1.15 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ వరి సాగు జరుగుతోంది. ఇందులో 90 శాతం మేర వరి పంటే సాగవుతుంది. ఏటా జూలై 15 నాటికి 30 శాతం మేర వరి ఉభాలు జరిగేవి. ఈ ఏడాది సెంటు భూమిలో కూడా వరినాటు పడలేదు. అక్కడక్కడ వరినారుమడులు సిద్ధం చేయగా అవి ఎండిపోతున్నాయి. వరి వెద పంటలు వేసిన రైతులకు ఈఏడాది ప్రతికూల వాతావరణం కన్నీటినే మిగుల్చుతోంది. ఎల్‌నినో ప్రమాదం ఉందని ప్రభుత్వానికి తెలిసినా జిల్లా రైతాంగాన్ని అప్రమత్తం చేయలేదు. ఫలితంగా రైతులు ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ముందుగానే వరినారుమడులు సిద్ధం చేసుకున్నారు. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. మొక్కజొన్న పంటలు సాగుచేస్తున్న రైతులకు ఈ కష్టాలు మరింత అధికమయ్యాయి.


