శివడవలసలో ఏనుగుల సంచారం | - | Sakshi
Sakshi News home page

శివడవలసలో ఏనుగుల సంచారం

Jul 18 2026 9:45 AM | Updated on Jul 18 2026 9:45 AM

బొబ్బిలిరూరల్‌: మండలంలోని శివడవలస గ్రామ పరిసరాల్లో ఏనుగులు శుక్రవారం సంచరించాయి. సీతానగరం మండలం నుంచి ముత్తాయివలస గ్రామానికి గురువారం చేరుకున్న ఎనిమిది ఏనుగుల గుంపు శివడవలస గ్రామ శివారులోని రైతుల కల్లాల్లోకి చేరాయి. వరి నారుమడుల్లో సంచరిస్తూ నాశనం చేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏనుగులను కవ్వించవద్దని, పొలాలకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులకు సీఐ నారాయణరావు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ పిల్లా వసుంధర, ఫారెస్టు రెస్క్యూ టీం సభ్యులు పాల్గొన్నారు.

గ్రూప్‌–2 ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

విజయనగరం అర్బన్‌: ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 (ప్రిలిమినరీ) పరీక్షకు ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు గురజాడ అప్పారావు ఏపీబీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ జె.జ్యోతిశ్రీ శుక్రవారం తెలిపారు. ఎంపికై న 100 మందికి 60 రోజుల పాటు ఉచిత శిక్షణతో పాటు స్టైఫెండ్‌, స్టడీ మెటీరియల్‌ అందిస్తామన్నారు. ఈ నెల 25లోగా బయోడేటా, 10వ తరగతి, డిగ్రీ మార్కుల జాబితాలు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ పాస్‌బుక్‌ జిరాక్స్‌, రెండు పాస్‌ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం సెల్‌: 96035 57333, 91777 26454 నంబర్లను సంప్రదించాలన్నారు.

ప్రశస్త్‌తో ప్రత్యేక అవసరాల పిల్లల గుర్తింపు

డీఈఓ మాణిక్యంనాయుడు

విజయనగరం అర్బన్‌: ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల (సీడబ్ల్యూఎస్‌ఎన్‌) గుర్తింపు కోసం కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం జిల్లాలో ‘ప్రశస్త్‌ 2.0’ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి యు.మాణిక్యంనాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026 – 27 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ పాఠశాలల్లో ఒకటి నుంచి 12వ తరగతి విద్యార్థులందరికీ స్క్రీనింగ్‌ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ముందుగానే గుర్తించి విద్యా, వైద్య, పునరావాస సేవలు అందిస్తామన్నారు. ఇందుకోసం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యా యులు ప్రశస్త్‌ 2.0 యాప్‌లో ఉన్న శిక్షణ వీడియోలను వీక్షించాలని కోరారు. ఆగష్ట్టు 15 లోపు పాఠశాలల యూడైస్‌ వివరాలను నవీకరించాలని తెలిపారు. సెప్టెంబర్‌ 15 లోపు ఉపాధ్యాయుల ద్వారా పార్ట్‌–1 స్క్రీనింగ్‌ ప్రక్రియ జరుగుతుందని.. ప్రత్యేక ఉపాధ్యాయుల ద్వారా పార్ట్‌–2 స్క్రీనింగ్‌ ప్రక్రియను తర్వాత నిర్వహిస్తామని పేర్కొన్నారు. సమగ్ర శిక్ష అధికారులు, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.

లీజు డబ్బులు చెల్లింపు

వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టులో చేపలు వేట చేసేందుకు అవసరమైన లీజు డబ్బులు రూ.18,21,817 లను మత్స్యశాఖకు చెల్లించినట్టు కొట్టిశ శ్రీసీతారామ స్వదేశీ మత్స్యకార సంఘం అధ్యక్షుడు పెనుబోతు దుర్గారావు స్పష్టంచేశారు. రాజాం ఫిషరీస్‌ అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రసాద్‌కు 1435వ ఫసలీకి సంబంధించి చెల్లింపులు చేసిన పత్రాలను శుక్రవారం అందజేశారు. లీజు చెల్లించకపోవడంతో గత కొంత కాలంగా ప్రాజెక్టులో చేపలవేట నిషేధం ఉందని, ప్రస్తుతం లీజు సొమ్ము చెల్లించడంతో వేటనిషేధం ఇకపై ఉండదని, మత్స్యకారులు చేపలవేట సాగించవచ్చని వెల్లడించారు. చేపల వేటకు అనుమతి రావడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మత్స్యకార సొసైటీ సంఘ సభ్యులు మల్లీడు తవిటన్నదొర, కోల రాము, పెనుబోతు సన్యాసిరావు, సిగిరి నర్శింగదొర, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement