గజపతినగరం : మండల కేంద్రంలోని మెయిన్ రోడ్డులో శ్రీసాయిగణేస్ జ్యువెలరీ షాపులో బంగారం ఆభరణాలు, వెండి వస్తువులు చోరీకి గురైనట్టు యజమాని చెరుకుపల్లి బ్రహ్మారెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ కె.కిరణ్‌కుమార్‌నాయుడు శనివారం తెలిపారు. శుక్రవారం అర్థరాత్రి కొందరు వ్యక్తులు షాపు వెనుక వైపు నుంచి గోడకు రంధ్రం పెట్టి షాపులోకి ప్రవేశించారు. సుమారు ఆరు తులాల బంగారు ఆభరణాలు, కొన్ని వెండి వస్తువులు దొంగిలించుకుపోయినట్టు ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.
తూర్పు ముఠా ప్రాంతంలో ఏనుగుల సంచారం
కురుపాం: మండలంలోని తూర్పు ముఠా ప్రాంతమైన జరడ – తిత్తిరి పరిసర ప్రాంతాల్లో ఏనుగులు సంచరిస్తున్నట్టు ఆ ప్రాంత గిరిజనులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం అర్థరాత్రి రెండు పంచాయతీల పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్టు గిరిజనులు తెలిపారు. వీటి సంచారంతో పంట పొలాలు ధ్వంసం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
19న జిల్లా స్థాయి
యోగాసనాల పోటీలు
నెల్లిమర్ల: జిల్లా స్థాయి యోగసనాల పోటీలు ఈ నెల 19న నిర్వహించనున్నట్టు నిర్వాహకులు పీవీఎన్ మూర్తి, ఎన్.పైడిరాజు శనివారం తెలిపారు. జిల్లా యోగాసనా స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఈ పోటీలు స్థానిక రామకృష్ణ ధ్యాన మందిరంలో నిర్వహిస్తామని పేర్కొన్నారు. పోటీల్లో సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో 10 – 55 వయస్సు గల వారు పాల్గొనవచ్చని తెలిపారు. ఈ నెల 16లోగా తమ కార్యాలయాన్ని సంప్రదించి పేరు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.


