సెల్ మోహన రంగా..!
వీరఘట్టం: ఒకప్పుడు ’అరచేతిలో ప్రపంచం’ అనే నినాదంతో స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఇప్పుడు సెల్ చేతిలో జీవితమే బందీగా మారిపోయింది. రోజురోజుకూ పెరుగుతున్న మొబైల్ ఫోన్ల వినియోగం అనర్థాలకు దారితీస్తోంది. ఈ ఫోన్ చిన్న, పెద్ద, ఆడ,మగా తేడా లేకుండా, అందరి జీవితాలను అరచేతిలోకి తీసుకుంది. మంచి కంటే చెడుకే ఎక్కువగా ఉపయోగపడుతోంది.తక్కువ శాతం మంది మాత్రమే అవసరాలకు వినియోగిస్తున్నారని పలు సర్వేల్లో తేలింది.ఎక్కువ శాతం మంది కాలక్షేపం కోసం ఫోన్ చూస్తుండడం పరిపాటిగా మారింది. అలాంటి వారిని క్రమంగా మొబైల్ బానిసలుగా మార్చేస్తోంది.
శరీరానికి కాసేపు రక్తం అందకపోయినా, ము క్కుకు శ్వాస ఆడకపోయినా ఫర్వాలేదుగాని నిమి షం పాటైనా చేతిలో సెల్ లేకుంటే బతకలేమన్నట్లుగా తయారయ్యారు నేటి యువత. డ్రగ్స్‌కు బానిసైనట్లు స్మార్ట్‌ఫోన్ బందీఖానాలో జనం బందీలుగా మారారు.ఇప్పుడు పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా స్మార్ట్‌ఫోన్ల వాడకం ఎక్కువైంది. మొబైల్ లేకుంటే బుర్ర కూడా పనిచేయడం లేదు. మితిమీరిన సెల్ వాడకం మనిషి జీవితాన్ని ఛిన్నాభిన్నం చేస్తు న్నా మార్పు రావడం లేదు. ఇప్పటికే చాలామందికి వారికి తెలియకుండానే మానసిక రోగుల్లా మారా రు. ఇంకొందరు అనారోగ్యం పాలవుతున్నారు.
జిల్లాలో ఆరు లక్షల ఫోన్లు
పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పడకముందు తొలువ ఉమ్మడి జిల్లాలో ఉన్న ఈ ప్రాంత ప్రజల్లో కొందరు 1995–96 మధ్య కాలంలో కీప్యాడ్ ఫోన్లు వాడేవారు. తొలుత పట్టణాల్లో మాత్రమే రిలయన్‌న్స్ మొబైల్ టవర్ల ద్వారా నెట్‌వర్క్‌ను అందిస్తూ సేవలను మొదలు పెట్టారు. ఆపై పలు సెల్ కంపెనీలు మార్కెట్లోకి వచ్చాయి.ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లాలో వివిద కంపెనీలకు చెందిన 356 సెల్‌ఫోన్ టవర్లు ఉన్నాయి. జిల్లా జనాభా 9.253 లక్షలు కాగా వారిలో సెల్ ఫోన్లు వాడేవారి సంఖ్య ప్రస్తుతం 6 లక్షలకు చేరింది. వీరు ప్రతినెలా రీచార్జ్‌లు, నెట్ సర్వీసుల కోసం రూ.10 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. నాలుగేళ్ల నుంచి సెల్‌ఫోన్‌ల వాడకం ఏటా 10 శాతం పెరుగుతున్నట్లు ట్రాయ్ లెక్కలు చెబుతున్నాయి. ట్రాయ్ గణాంకాలను పరిశీలిస్తే ఇలా ఉన్నాయి. ప్రధానంగా మొబైల్ అధికంగా వినియోగించే వారిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) తెలిపింది. ఎన్ని రకాల సమస్యలు ఎదురవుతున్నాయో డబ్ల్యుహెచ్‌ఓ సర్వే వివరించింది.
రాత్రి పూటే ప్రమాదకరం
ప్రధానంగా రాత్రిపూట నిద్రపోకుండా సెల్ చూడడం వల్ల కొన్ని రోజుల తర్వాత నిద్రరాని పరిస్థితి ఏర్పడుతుంది. శరీరంలో మెలటోనియన్ నిల్వలు నశించి డిప్రెషన్‌లోకి వెళ్లే అవకాశం ఉంటుంది.చీకట్లో సెల్‌ఫోన్ చూడడంతో దాని నుంచే వచ్చే బ్లూ కిరణాలు రెటీనాను బలహీనం చేసే కార్ట్‌డాక్ సమస్యలు తప్పవు. రాత్రి ఫోన్ చూసే పిల్ల లకు తలనొప్పి, చూపు మందగించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. దీంతోపాటు మెడనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది.
గూగుల్ సర్వే ఇలా
స్మార్ట్‌ఫోన్స్ వాడుతున్నవారిలో అధిక శాతంమంది యూట్యూబ్ చూస్తుండగా, సగానికంటే ఎక్కువగా వాట్సాప్, ఫేసుబుక్, ఇన్‌స్ట్రాగామ్ లను వాడుతున్నట్టు గూగూల్ చేసిన సర్వేలో తేలింది. ఆన్‌లైన్ గేమ్స్ కోసం యువత ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారు. మహిళలు పనిపాట చేసుకుంటూ కూడా సీరియళ్లను సెల్ లోనే చూసేవారి సంఖ్య పెరుగుతోంది. ఇక చిన్నపిల్లలు సైతం స్మార్ట్‌ఫోన్ చేతికివ్వకుంటే ఏడుపు మొదలు పెట్టడం చూస్తూనే ఉన్నాం. ఈ విధంగా సెల్ మనిషిని ఆవహించింది అని చెప్పవచ్చును.
సెల్‌తొ సమస్యలు
నిద్రలేమి, తలనొప్పి, భుజం, మెడ నొప్పి, బరువు పెరగడం, చూపు తగ్గిపోవడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, ఏకాగ్రత దెబ్బతినడం, డిప్రెషన్‌లోకి వెళ్లడం.
అనర్థాలపై అవగాహన అవసరం
మితిమీరిన సెల్‌ఫోన్ వాడకంతో కలిగే అనర్థాలపై పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు తరచూ అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నాం.పలురకాల సెక్స్ చాన్‌ల్స్ కూడా చూస్తూ కొందరు యువత పెడదోవ పడుతున్నారు. ఇలాంటి వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నాం. ఏదైనా అవసరం ఉంటే తప్ప ఫోన్ వాడకం తగ్గించాలి. దీంతో ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.
– ఎస్.షణ్ముఖరావు,ఎస్సై, వీరఘట్టం
మానసిక ఇబ్బందులు తప్పవు
పాలు తాగే పసిపిల్లల నుంచి సెల్ ఉంటేనే అన్నట్లు తయారైంది నేటి సమాజం. పిల్లలు ఏడుస్తుంటే బొమ్మలిచ్చే కాలంపోయింది. చేతికి సెల్ ఇస్తేనే వారు ఏడుపు ఆపుతారు. అధికంగా సెల్ వాడడం వల్ల మెడనొప్పి, కళ్లు కనిపించకపోవడం, తలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువ. ఇక నిద్రపోకుండా రాత్రుల్లో సెల్ చూసేవారికి పలు ఆరోగ్య సమస్యలు తప్పవు. మనిషికి కనీసం ఏడు గంటల నిద్ర ఉండాలి.
– జె.రవీంద్రకుమార్, చిన్నపిల్లల వైద్య
నిపుణుడు, ఏరియా ఆస్పత్రి, పార్వతీపురం
జిల్లాలో పెరిగిన స్మార్ట్ ఫోన్ల వినియోగం
పార్వతీపురం మన్యం జిల్లా జనాభా సుమారు 9.253 లక్షల మంది
వారిలో 6 లక్షలు దాటిన సెల్‌ఫోన్ యూజర్లు
రీచార్జ్ కోసం ప్రజలు నెలకు చేస్తున్న ఖర్చు రూ.10 కోట్లు
అతి వాడకంతో ఆరోగ్య సమస్యలు
సెల్ మోహన రంగా..!
సెల్ మోహన రంగా..!


