అధికారం ఉంది.. అంతా వారిదే అనుకున్నారు. ఉపాధిహామీ పథకాన
● ఇదీ లెక్క...
సాక్షి ప్రతినిధి, విజయనగరం:
అధికారం మనది.. మనల్ని ఎవడు ఆపేది అంటూ మంచి జోరుమీదున్న తెలుగుదేశం నాయకులు ఏకంగా ఉపాధి హామీ పథకాన్ని తమ జేబులోని పథకంగా మార్చేశారు. జిల్లా స్థాయి అధికారులను ఏమార్చి పథకంలోని డబ్బులు సొంత జేబుల్లోకి మార్చేశారు. నియోజకవర్గ ముఖ్యనేత అనుచరుడు.. షాడో నేత అండగా ఉంటే ఇక అడ్డేముంది అనుకున్న మండలస్థాయి అధికారి తన కిందనున్న ఉపాధి హామీ సిబ్బందిని.. ఇంజినీరింగ్ స్టాఫ్‌ను తన ఆధీనంలో పెట్టుకుని కంప్యూటర్లలో లెక్కలు మార్చేసి రూ.కోట్లు కొట్టేశారు. పంచాయతీల్లో తమ మాటవినే వారికి జాబ్‌కార్డులు ఇచ్చి.. వారు పనికి వెళ్లకుండానే మస్తర్లు వేసేశారు. వారి ఖాతాలో డబ్బులు పడాక వారంవారం కలెక్షన్ చేశారు. ఇలా... ఒక మండలం నుంచి రూ.2కోట్లు వరకు కొట్టేసినట్టు సమాచారం. ఈ అక్రమాలపై విజయనగరం మండల ఎంపీపీ పలుమార్లు మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే సమక్షంలో ప్రస్తావించినా పట్టించుకునేవారే కరువయ్యారు.
విజయనగరం మండలంలోని 22 గ్రామా పంచాయతీల్లో 8,628 మంది వేతనదారులు ఉన్నారు. వారిలో 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఉపాధిహామీ పనికి వెళ్లిన వారికి దాదాపు రూ.12.23 కోట్లను వేతనంగా చెల్లించారు. వీరిలో కొందరు పనికి వెళ్లకపోయినా వెళ్లినట్లు మస్తరు వేయించి వారి బ్యాంకు ఖాతాకు జమైన వేతనం డబ్బులు వసూలుచేసి బంగ్లా మనిషికి అందించినట్టు సమాచారం. ఈ వ్యవహారంలో మండలస్థాయి అధికారి కీలకభూమిక పోషించినట్టు తెలిసింది. డబ్బులు రుచిమరిగిన షాడోనేత మండల స్థాయి అధికారికి అపరిమిత స్వేచ్ఛ ఇవ్వడం మొదలెట్టారు. దీంతో ఆయన ఆఫీసులోనే కూర్చుని సర్పంచులు.. ఎంపీటీసీలు.. ఇతర టీడీపీ నేతలను సైతం చిన్నచూపు చూస్తూ.. పాక్షికంగా రాజకేయనేత తరహా వ్యవహారం నడపడం మొదలెట్టారు. ఈ వ్యవహారం ముదిరిపోవడం, తిరిగి టీడీపీ నాయకులకే డబ్బులిస్తే పదవులను కట్టబెట్టేస్థాయిలో ఆ అధికారి మాటలు ఉండడంతో కొందరు నేతలు విషయాన్ని బంగ్లాకు చేర్చారు. షాడోనేత ఆధ్వర్యంలో ఓ ముహుర్తాన వేపచెట్టు కింద కూర్చొని అధికారిపై మూకుమ్మడిగా అధికారిపై తిట్లపురాణం చదివారు. అంతే.. ఇన్నాళ్లూ ఉపాధిహామీ నిధులను షాడోనేతకు అందజేస్తూ దర్జాగడిపిన అధికారి ఉన్నఫలంగా సెలవుపై వెళ్లిపోయినట్టు సమాచారం. నిధుల కై ంక్యర్యం వ్యవహారం బయటపడడంతో మళ్లీ వచ్చేసరికి ఆయన ఆ పోస్టులో ఉంటారా లేదా అన్న చర్చ మండలంలో సాగుతోంది. ఉపాధిహామీ పనులు, మస్తర్లలో అక్రమాలపై ఉన్నతాధికారులు దృష్టిసారిస్తే అసలు విషయం వెలుగుచూస్తుందని కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు చెబుతున్నారు.
మా దృష్టికి
రాలేదు
2024–25 ఆర్థిక సంవత్సరంలో
రూ.2 కోట్లు కొట్టేసినట్టు సమాచారం
వారానికి దాదాపు రూ.20 లక్షల చొప్పున అక్రమార్జన
ఓ మండల స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఓ నేత జేబులోకి డబ్బులు
పనికి వెళ్లకుండానే మస్తర్లు...
ఆనక వసూళ్లు
అక్రమ వసూళ్లపై పలుమార్లు మండల సర్వసభ్య సమావేశంలో ప్రస్తావించిన ఎంపీపీ
పట్టించుకోని ఎమ్మెల్యే, ఉన్నతాధికారులు
అధికారి ఆగడాలు శృతిమించడంతో
నిలదీసిన ప్రజాప్రతినిధులు
సెలవుపై వెళ్లిపోయిన అధికారి
విజయనగరం మండలంలో దొంగ మస్టర్లు వేసిన విషయం మా దృష్టికి రాలేదు. ఇప్పటివరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఆ విషయంపై దృష్టిసారించి వాస్తవాలు వెలికితీస్తాం.
– రవి బాబు, ఏపీఓ, విజయనగరం మండలం


