సర్వజన ఆస్పత్రిలో నిలిచినసీబీపీ పరీక్షలు..!
● అవస్థలు పడుతున్న రోగులు
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో సీబీపీ పరీక్షలు జరగక రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఆస్పత్రికి రోజుకి 40 నుంచి 50 మంది రోగులకు సీబీపీ (కంప్లీట్ బ్లడ్ పిక్చర్) పరీక్షలు చేస్తారు. కొద్ది రోజులుగా ఆస్పత్రిలో సీబీపీ పరీక్షలు జరగడం లేదు. ఆస్పత్రికి వచ్చేరోగులు ప్రైవేటు ల్యాబొరేటరీల్లో పరీక్షలు చేయించుకోవాల్సిన పరిస్థితి. జ్వరంతో బాధపడేవారికి, రక్తహీనత, బ్లడ్ ఇనఫెక్షన్స్, శస్త్రచికిత్స అవసరమైన వారికి సీబీపీ పరీక్ష చేస్తారు. ఈ పరీక్షలో రోగి శరీరంలో ఎంత రక్తం ఉంది, ఎర్ర రక్తకణాలు, తెల్లరక్త కణాల సంఖ్య వంటివి నిర్ధారణ అవుతాయి. అయితే, పరీక్షలు చేసేందుకు అవసరమైన రియాజన్స్ అయిపోవడంతో ఆస్పత్రిలో పరీక్షలు నిలిచిపోయినట్టు సమాచారం. వాస్తవంగా రియాజన్స్ ముందుస్తుగానే సరఫరాల చేయాలి. చంద్రబాబు ప్రభుత్వం సకాలంలో సరఫరా చేయక పోవడం వల్ల రోగులకు అవస్థలు తప్పడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


