రక్తదానంలో ‘రాముడు’
రాజాం: ఒకసారి రెండు సార్లు కాదు ఏకంగా ఆయన 58 సార్లు రక్తదానం చేశారు. 18వ ఏట ఆరంభించిన రక్తదాన యజ్ఞాన్ని చిత్తశుద్ధితో కొనసాగిస్తూ.. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నారు. రక్తదాతగా పేరుపొందారు. ఆయనే రాజాం మండలం పొగిరి గ్రామానికి చెందిన శనపతి రాము. అత్యవసరంగా ఓ పాజిటివ్ బ్లడ్ కావాలని పిలుపు రావడంతో రాజాంలోని జీఎంఆర్ కేర్ ఆస్పత్రికి గురువారం వెళ్లి రక్తదానం చేసినట్టు రాము తెలిపారు. రక్తదాతను ఆస్పత్రివైద్యులు అభినందించారు.
రెవెన్యూ సర్వీసెస్ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ
విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్–2026 డైరీ, క్యాలెండర్‌ను కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డైరీలో పొందుపరిచిన రెవెన్యూ విభాగానికి సంబంధించిన కీలకమైన చట్టాలు, సర్కులర్లు, మెమోలు ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. విధి నిర్వహణలో అవసరమైన సమాచారాన్ని ఒకే చోట పొందగలగడం వల్ల పనిలో వేగం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ సంఘం అధ్యక్షుడు దాడ్డి గోవింద్, కార్యదర్శి నూర్యతోపాటు జిల్లా రెవెన్యూ అధికారి మురళి, కలెక్టరేట్ ఏఓ దేవ్ ప్రసాద్, ఇతర రెవెన్యూ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం రెవెన్యూ సిబ్బంది కలెక్టర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
17న ‘స్వచ్ఛ రథం’ ప్రారంభం
విజయనగరం అర్బన్: గ్రామీణ ప్రాంతాల్లో పొడి చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాల సమర్ధ నిర్వహణే లక్ష్యంగా ‘స్వచ్ఛ రథం’ పథకాన్ని ఈ నెల 17వ తేదీన జిల్లా వ్యాప్తంగా ప్రారంభించనున్నట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి గురువారం తెలిపారు. ఈ పథకం వస్తుమార్పిడి (బార్టర్) విధానంలో కొనసాగుతుందని వివరించారు. ప్రజలు అందజేసే పొడి చెత్తకు బదులుగా నిత్యావసర సరుకులు అందిస్తారని, దీనివల్ల గ్రామాల్లో చెత్త వేరు చేసే అలవాటు పెంపొందుతుందని తెలిపారు. జిల్లాలోని 27 మండలాలకు ఒక్కో స్వచ్ఛ రథానికి నెలవారీ అద్దె విధానంలో ఆపరేటర్లను ఎంపిక చేస్తామన్నారు. ఎంపికై న వారికి నెలకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి అద్దె చెల్లిస్తామన్నారు. ఔత్సాహికులు తమ దరఖాస్తులను జిల్లా పంచాయతీ అధికారి విజయనగరం కార్యాలయానికి ఈ నెల 7వ తేదీలోగా సమర్పించాలని కలెక్టర్ కోరారు. అందిన దరఖాస్తులను జిల్లా స్థాయి కమిటీ పరిశీలించి అర్హులైన ఆపరేటర్లను ఎంపిక చేస్తుందన్నారు.
బాలక్ రామమందిర్‌కు రూ.లక్ష విరాళం
విజయనగరం టౌన్: అయోధ్య బాలక్ రామమందిర్ నమూనాలో నిర్మితమవుతున్న బాలక్ రామమందిర్‌కు శ్రీ వాసవీ చారిటీ మిత్రుల గ్రూప్, వాసవీక్లబ్ సంయుక్తంగా రూ.లక్షా11వేల111లు ఆలయ అధ్యక్షుడు కుసుమంచి సుబ్బారావుకు గురువారం విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో చారిటీ గ్రూప్ అధ్యక్షుడు ఆలవెల్లి శేఖర్, వాసవీక్లబ్ జిల్లా గవర్నర్ తమ్మన కల్యాణ్‌రాజు, ఆలయ కన్వీనర్ పువ్వాడ శ్రీహరి, కార్యదర్శి డిమ్స్ రాజు, కోశాధికారి సముద్రాల నాగరాజు, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కుంకాల పండు, తదితరులు పాల్గొన్నారు.
రక్తదానంలో ‘రాముడు’
రక్తదానంలో ‘రాముడు’


