కిక్‌ఇచ్చిన మద్యం అమ్మకాలు
● మూడు రోజుల్లో ప్రభుత్వ ఖజానాకు రూ.21.30 కోట్ల ఆదాయం
● అర్ధరాత్రి దాటిన వరకు అమ్మకాలు
విజయనగరం రూరల్: కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లాలో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు జిల్లా నుంచి ఆదాయం భారీగా సమకూరింది. నూతన సంవత్సరం వేళ మద్యం అమ్మకాలతో భారీ ఆదాయాన్ని సమకూర్చుకోవాలనే ధ్యేయంతో అర్ధరాత్రి ఒంటి గంట వరకు అమ్మకాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. జిల్లాలోని అబ్కారీశాఖ పరిధిలో 169 మద్యం దుకాణాలు, 20 బార్లు ఉన్నాయి. గతనెల 29, 30, 31 తేదీల్లో రూ.21.30 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు సాగాయి. 29న 11,168 ఐఎంఎల్ కేసులు, 3,996 బీరు కేసుల విక్రయాలతో రూ.8.05 కోట్లు, 30న 9,674 మద్యం కేసులు, 3,634 బీరు కేసుల అమ్మకాలతో రూ.6.9 కోట్లు, 31న 8,941 ఐఎంఎల్ కేసులు, 3,464 బీరు కేసుల అమ్మకాలతో రూ.6.35 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరింది. మరోవైపు మద్యం తాగి వాహనాలు నడిపేవారి నుంచి (డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు) అపరాధ రుసుం రూపంలో భారీగా ఆదాయం సమకూరినట్టు సమాచారం.
కిక్‌ఇచ్చిన మద్యం అమ్మకాలు


