రోడ్డు నిబంధనలు విధిగా పాటించాలి
విజయనగరం అర్బన్: ప్రతి ప్రయాణికుడు రోడ్డు నిబంధనలను కచ్చితంగా పాటించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి ప్రజలకు సూచించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను ఆయన గురువారం అధికారికంగా ప్రారంభించారు. వాల్‌పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రహదారిపై వాహనాలను జాగ్రత్తగా నడిపితే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చన్నారు. జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 90 శాతం నిబంధనలు పాటించకపోవడం వల్లే సంభవిస్తున్నాయని తెలిపారు. వాహన చోదకులు తమ కుటుంబాలు, పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని బాధ్యతతో వాహనాలను నడపాలని సూచించారు. జాతీయ రహదారి భద్రతా నియమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివిధ వర్గాల ప్రజలకు, వాహన చోదకులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఉప రవాణా కమిషనర్ డి.మణికుమార్, మోటారు వాహన తనిఖీ అధికారులు మురళీకృష్ణ, దుర్గప్రసాద్, శశికుమార్, రవిశంకర్ ప్రసాద్, వెంకటరావు, శివరామగోపాల్, రమేష్‌కుమార్, ఉష, శ్రావ్య, ఐశ్వర్యలక్ష్మి, నవీన్, తదితరులు పాల్గొన్నారు.


