బిల్‌స్టాప్ మీటర్లతో ఖజానాకు గండి
● ఓ ఉద్యోగిపై అనుమానాలు
● రూ.లక్షల్లో గోల్‌మాల్
● ఆ శాఖ ఉద్యోగిపై విచారణ
విజయనగరం ఫోర్ట్: విద్యుత్ శాఖలో పనిచేసే ఓ ఉద్యోగి సొంతింటికి కన్నం వేసినట్టు ఆ శాఖ సిబ్బంది గుసగుసలాడుతున్నారు. బిల్‌స్టాప్ మీటర్ల ను ఒక్కొక్కటి రూ.10వేల నుంచి రూ.15వేలకు అమ్మేసి సొమ్ముచేసుకున్నట్టు సమాచారం. ఈ వ్యవహారంలో రూ.20 లక్షల నుంచి రూ. 30లక్షల వరకు గోల్‌మాల్ జరిగినట్టు పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. దీనివెనుక ఆ శాఖ అధికారు ల పాత్ర కూడా ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. బిల్లు స్టాప్ మీటర్లు వినియోగించడం వల్ల ఎంత విద్యుత్ వినియోగించినా బిల్లు రాదు. దీనివల్ల విద్యుత్ వినియోగానికి వినియోగదారుడు బిల్లు కట్టాల్సిన అవసరం ఉండదు. విద్యుత్‌శాఖ ఆదాయానికి భారీగా గండిపడుతుంది. ఇదే విషయాన్ని విద్యుత్‌శాఖ ఈఈ పెద్దింటి త్రినాథరావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా డిస్‌కనెక్షన్ చేసిన మీటర్లను జూనియర్ లైన్‌మన్ మార్చినట్టు మా దృష్టికి వచ్చిందని, దీనిపై ఉద్యోగి నుంచి సంజాయిషీ కోరామన్నారు. ఇచ్చిన వివరణ మేరకు శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.


