పర్యాటకుల విడిది.. తాటిపూడి
విజయనగరం గంటస్తంభం:
ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ప్రశాంతంగా విహరించాలనుకునే పర్యాటకులను గంట్యాడ మండలంలో ఉన్న తాటిపూడి (గొర్రిపాటి బుచ్చిఅప్పారావు) ప్రాజెక్టు ఆకర్షిస్తోంది. అటవీశాఖ, వన సంరక్షణ సమితి సహకారంతో ఇక్కడ నడుస్తున్న ఎకో టూరిజం కేంద్రం పచ్చని అడవులు, కొండలు, విస్తారమైన జలాశయం కలిసిన అద్భుత దృశ్యాలు పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తున్నాయి. ప్రకృతి సోయగాల మధ్య అటవీశాఖ నిర్మించిన 10 కాటేజీలు సందర్మకులకు ప్రశాంత వాతావరణంలో బసచేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.
పచ్చని కొండల మధ్య వసతి
పట్టణ కాలుష్యానికి దూరంగా, ప్రశాంత వాతావరణంలో కాటేజీలను కొండ పాదాల వద్ద నిర్మించారు. చుట్టూ అడవులు, ఎదురుగా తాటిపూడి రిజర్వాయర్ కనిపించేలా ఏర్పాటు చేయడంతో పర్యాటకులు ప్రకృతి ఒడిలో ఉన్న అనుభూతిని పొందుతున్నారు. కాటేజీల నిర్వహణను ఈడీసీ ఆధ్వర్యంలో స్థానిక గిరిజనులు నిర్వహించడం విశేషం.
వేడుకలకు వేదిక...
కార్పొరేట్ సమావేశాలు, కుటుంబ వేడుకలు, పుట్టినరోజు కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా మీటింగ్ హాల్ అందుబాటులో ఉంది. మీటింగ్ హాల్ అద్దె రూ.5 వేలు మాత్రమే. ముందస్తుగా తెలియజేస్తే కావాల్సిన ఆహారాన్ని అక్కడే సిద్ధం చేస్తారు. రిజర్వాయర్‌లో పట్టిన చేపలను పర్యాటకుల ముందే వండి వడ్డించడం ఇక్కడి ప్రత్యేకత.
రవాణా సౌకర్యం...
ఎకో టూరిజం కేంద్రం ప్రధాన నగరాలకు సులభంగా చేరుకునేలా ఉంది. విజయనగరం నుంచి 32 కి.మీ, విశాఖపట్నం నుంచి 70 కి.మీ.దూరంలో ఉంది. విజయనగరం–ఎస్.కోట జాతీయ రహదారిపై ఐతన్నపాలెం కూడలి నుంచి కేవలం 7 కి.మీ. దూరంలో కాటేజీలు ఉన్నాయి. కాటేజీలకు వెళ్లేందుకు రోడ్డు సదుపాయం ఉంది.
మరిన్ని సౌకర్యాలు
తాటిపూడి గిరివినాయక ఎకో టూరిజం కేంద్రంలో అదనపు సౌకర్యాలు కల్పిస్తున్నాం. రిజర్వాయర్‌లో బోటింగ్ సౌకర్యం, పిల్లల కోసం చిల్డ్రన్ ప్లే పార్క్ ఏర్పాటు చేసే ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ప్రకృతి ఒడిలో ఉన్న ఎకో టూరిజం కేంద్రాన్ని పర్యాటకులు వినియోగించుకోవాలి.
– బిర్లంగి రామ్‌నరేష్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్
రిజర్వాయర్
చెంతనే నిర్మించిన కాటేజీలు
అందుబాటులో వసతి సౌకర్యం..
పర్యాటకుల కోసం ఇక్కడ మొత్తం 10 కాటేజీలు ఉన్నాయి. ఒక్కో కాటేజీలో రెండు బెడ్ రూమ్‌లు, అవసరమైన అన్ని ఆధునిక సౌకర్యాలు కల్పించారు. రోజుకు కాటేజీ అద్దెను రూ.2,500గా నిర్ణయించారు. చిన్న కుటుంబాలకు ఇది అనువుగా ఉంది. సేంద్రియ పంటలతో తయారు చేసిన రుచికరమైన భోజనం అందించేందుకు ప్రత్యేక రెస్టారెంట్ సదుపాయం ఉంది. బొంగు చికెన్ వంటి స్థానిక వంటకాలు పర్యాటకులకు నోరూరిస్తున్నాయి.
గిరిజన నృత్యాల ప్రదర్శన
పర్యాటకుల కోరిక మేరకు గిరిజన సంప్రదాయాలను ప్రతిబింబించే థింసా, మయూరి నృత్యాలు ప్రదర్మిస్తారు. చలి రాత్రుల్లో క్యాంప్ ఫైర్, సాహస ప్రియుల కోసం ట్రెక్కింగ్ మార్గం అందుబాటులో ఉంది.
పర్యాటకుల విడిది.. తాటిపూడి
పర్యాటకుల విడిది.. తాటిపూడి
పర్యాటకుల విడిది.. తాటిపూడి
పర్యాటకుల విడిది.. తాటిపూడి


