● సోషల్ టీచర్‌ను నియమించండి
మా పాఠశాలలో ఒకటి నుంచి 8వ తరగతి వరకు 90 మంది విద్యార్థులం చదువుతున్నాం.. మాకు సోషల్ టీచర్ లేరు.. పాఠ్యాంశ బోధన జరగడం లేదు.. తక్షణమే సోషల్ టీచర్‌ను నియమించాలంటూ కొత్తవలస మండలం వీరభద్రపురం ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు శనివారం కోరారు. గతంలో ఇక్కడ పనిచేసిన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు జె.వి.ఎస్.సన్యాసిరావును తోటి విద్యార్థులు, ఉపాధ్యాయినులపై అనుచిత ప్రవర్తన, లైంగిక ఆరోపణలతో గతేడాది సస్పెండ్ అయ్యారు. కొద్దిరోజుల తర్వాత ఆయన సస్పెన్షన్ రద్దుచేసి తొలుత పూసపాటిరేగ మండలం ముక్కాం జెడ్పీ హైస్కూల్, ఈ ఏడాది జూన్‌లో మళ్లీ వీరభద్రపురం ప్రాథమికోన్నత పాఠశాలలో నియమించారు. ఆయనను తాజాగా డీఈఓ మౌఖిక ఆదేశాలతో జామి జెడ్పీ హైస్కూల్‌కు బదిలీ చేశారు. దీంతో ప్రస్తుతం వీరభద్రపురం పాఠశాలలో శాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు పోస్టు ఖాళీగా ఉంది. ఎఫ్‌ఏ పరీక్షలు దగ్గర పడుతుండడంతో పాఠ్యాంశ బోధన జరగక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయంపై ఎంఈఓ జి.శ్రీదేవి స్పందిస్తూ సోషల్ టీచర్‌గా వేరొకరిని నియమించేందుకు ప్రయత్నిస్తున్నామని, లేదంటే అదే పాఠశాలో బీఈడీ చేసిన ఉపాధ్యాయులతో పాఠ్యాంశాల బోధనకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. – కొత్తవలస


