10 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు
● కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో అదనంగా 10 వేల ఎకరాల్లో ఉద్యానసాగుకు ప్రణాళికలు రూపొందించినట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ శాఖలు సమష్టిగా, సమన్వయంతో కృషిచేసి లక్ష్యాన్ని సాధించాలన్నారు. వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యసాయాన్ని లాభసాటి చేయాలన్న ఉద్దేశంతో సంప్రదాయ వరి పంటకు బదులు ఉద్యాన పంటల విస్తరణకు ప్రత్యేక మిషన్‌ను రూపొందించామన్నారు. ప్రస్తుత రబీ సీజన్‌లో 4వేలు ఎకరాలు, ఖరీఫ్‌లో 6 వేలు ఎకరాల్లో సాగు పెంచాలన్నది మిషన్ లక్ష్యమన్నారు. పొలానికి 180 మీటర్ల దూరం లోపు విద్యుత్ సదుపాయం ఉన్న రైతులను ముందుగా ఎంపిక చేయాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి వి. తారకరామరావు, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసపాణి, తదితరులు పాల్గొన్నారు.
● ప్రధాన మంత్రి సూర్యఘర్ పథకంలో భాగంగా జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా సౌర విద్యుత్‌ను అందించే పథకాన్ని జనవరి మొదటి వారంలో ప్రారంభించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. అర్హులైన ప్రతి ఇంటిపై రెండు కిలో వాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్ ఫలకాల ఏర్పాటుకు ప్రభుత్వం ఎటువంటి ఖర్చు లేకుండా అందిస్తుందన్నారు. సమావేశంలో ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ మువ్వల లక్ష్మణరావు పాల్గొన్నారు.


