జాబు ఏది బాబూ..?
విజయనగరం గంటస్తంభం:
చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టి 18 నెలలు పూర్తయినా జాబ్‌క్యాలెండర్ ప్రకటించకుండా నిరుద్యోగులను మోసం చేస్తోందంటూ ఏఐవైఎఫ్ నాయకులు విజయనగరంలో శనివారం ఆందోళన చేశారు. ఎన్నికల సమయంలో యువత, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు పట్టణంలో భిక్షాటన చేస్తూ ప్రభుత్వం తీరుపై వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు బూరవాసు మాట్లాడుతూ యువగళం పేరిట జిల్లాలో చేపట్టిన పాదయాత్రలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని, నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3వేలు చెల్లిస్తామని నేతలు హామీ ఇచ్చారన్నారు. 18 నెలలుగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. నిరుద్యోగుల సమస్యలు ప్రభుత్వానికి కనిపించడం లేదని విమర్శించారు.
ఉద్యోగాలు రాక నిరుద్యోగ యువత నిరాశకు గురై మాదకద్రవ్యాలకు బానిసలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించి జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ విడుదలచేసి, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంతో పాటు నిరుద్యోగ భృతి రూ.3వేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్మి వెలగడ రాజేష్, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు సుమన్, చరణ్, విద్యార్థులు, యువత పాల్గొన్నారు.
బాబు వచ్చాడు.. జాబుల్లేవు
జాబ్‌క్యాలెండర్ హామీని విస్మరించిన చంద్రబాబు ప్రభుత్వం
నిరుద్యోగ భృతి చెల్లింపు ఊసేలేదు
యువత భవిష్యత్తు ఎటు?
భిక్షాటనతో ఏఐవైఎఫ్ నిరసన


