ఉత్తమ ఫలితాల సాధనే లక్ష్యం
● కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి
విజయనగరం అర్బన్: పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధన కోసం రూపొందించిన 100 రోజుల ప్రత్యేక బోధన ప్రణాళికను సమర్ధవంతంగా అమలు చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరలో పీజీఆర్‌ఎస్‌పై సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని 297 పాఠశాలల నుంచి 16,240 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరవుతారన్నారు. వీరందరూ ఉత్తీర్ణులయ్యేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. ప్రత్యేకాధికారులు, మండల అధికారులు తమ లక్ష్యాలకు అనుగుణంగా పాఠశాలల తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. వారానికి కనీసం నాలుగు సార్లు సచివాలయాలను సందర్శించాలని మండల ప్రత్యేకాధికారులు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. తనిఖీ వివరాలను గూగుల్ షీట్‌లో నమోదు చేయాలన్నారు. సమావేశంలో జేసీ సేతుమాధవన్, డీఆర్వో మురళి పాల్గొన్నారు.
పీఎంఏజీవైను విజయవంతం చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రధాన మంత్రి గ్రామీణ ఆదర్శ యోజన (పీఎంఏజీవై) పథకాన్ని జిల్లాలో సమర్ధవంతంగా అమలుచేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సంబంధిత శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ పథకం అమలుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ 500 జనాభా కలిగి అందులో కనీసం 40 శాతం షెడ్యూల్డ్ కులాల వారు నివసిస్తున్న మెరకముడిదాం, వంగర, తెర్లాం, ఆర్.ఆమదాలవలన మండలాల్లోని ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి ప్రతిపాదించామని చెప్పారు. ఈ పథకం కింద వివిధ అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల చొప్పున నిధులు అందుతాయని తెలిపారు. సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ డిప్యూటీ డైరెక్టర్ ఎం.అన్నపూర్ణమ్మ, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్‌పాణి, జెడ్పీ సీఈఓ సత్యనారాయణ, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ పాల్గొన్నారు.


