పరిష్కారం ఆలస్యమైతే సహించేది లేదు
● కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి
● పీజీఆర్‌ఎస్‌లో 257 వినతుల
స్వీకరణ
విజయనగరం అర్బన్: కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు విశేష స్పందన లభించింది. ఫిర్యాదుదారుల నుంచి మొత్తం 257 అర్జీలు స్వీకరించినట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతిని త్వరితగతిన బాధ్యతాయుతంగా పరిష్కరించాలని సంబంధిత శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. వినతుల పరిష్కారంలో ఆలస్యం ప్రదర్శిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌తోపాటు జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, డీఆర్‌ఓ మురళి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొని ప్రజల సమస్యలను స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత శాఖల అధికారులు అర్జీదారులను ప్రత్యక్షంగా కలిసి మాట్లాడిన తర్వాతనే ఎండార్స్ మెంట్ ఇవ్వాలని అలాగే మాట్లాడిన తేదీ, సమయాన్ని నివేదికలో తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. విభాగాల వారీగా వినతుల వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా డీఆర్‌డీఏకు 82 అర్జీలు, రెవెన్యూశాఖకు 70, జిల్లా పంచాయతీ శాఖకు 28, జిల్లా వైద్యారోగ్యశాఖకు 16, మున్సిపల్ శాఖకు 7, గ్రామ సచివాలయ శాఖకు 6, విద్యాశాఖకు 5, విద్యుత్ శాఖకు 4, హౌసింగ్ శాఖకు 4, ఇతర శాఖలకు చెందినవి 35 వరకు ఉన్నాయి. పీజీఆర్‌ఎస్ టోల్ ఫ్రీ నంబర్ 1100పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. ఈ నంబర్‌కు వచ్చే కాల్స్‌కు సంబంధిత అధికారులు సరైన విధంగా సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్, జిల్ల రెవెన్యూ అధికారి మురళి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు డి.వెంకటేశ్వరరావు, రాజేశ్వరి, ప్రమీల గాంధీ, బి.శాంతి, సర్వేశాఖ ఎ.డి ఆర్.విజయకుమార్, కలెక్టరేట్ అధికారి దేవీప్రసాద్, సీపీఓ బాలాజీ, డీఈఓ మాణిక్యంనాయుడు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ పీజీఆర్‌ఎస్‌కు 27 ఫిర్యాదులు
విజయనగరం క్రైమ్: స్థానిక డీపీఓలోని కాన్ఫరెన్స్ హాలులో ఎస్పీ ఏఆర్ దామోదర్ సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించి 27 ఫిర్యాదులను స్వీకరించారు. వాటిలో భూతగాాదాలకు సంబంధించి 11, కుటుంబ కలహాలకు సంబంధించి 3, నగదు వ్యవహారాలకు సంబంధించి 2, మోసాలకు సంబంధించి 1, ఇతర అంశాలకు సంబంధించి 10 ఫిర్యాదులు వచ్చాయి. సంబంధిత అధికారులు ఫిర్యాదు అంశాలను పరిశీలించాలని, వాటి పూర్వాపరాలను విచారణ చేయాలని ఎస్పీ దామోదర్ ఆదేశించారు. ఫిర్యాదు అంశాల్లో వాస్తవాలను గుర్తించి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని సూచించారు. స్వీకరించిన ఫిర్యాదులపై ఏడు రోజుల్లో వాటి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాలను నివేదిక రూపంలో జిల్లా పోలీసు కార్యాలయానికి పంపాలని సంబంధిత పోలీసు అధికారులను ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీసీఆర్బీ సీఐ కె.కుమార స్వామి, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, ఎస్సైలు రాజేష్, ప్రభావతి పాల్గొన్నారు.
పరిష్కారం ఆలస్యమైతే సహించేది లేదు


