అర్జీలకు నాణ్యమైన పరిష్కారం ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

అర్జీలకు నాణ్యమైన పరిష్కారం ఇవ్వాలి

Dec 23 2025 6:48 AM | Updated on Dec 23 2025 6:48 AM

అర్జీ

అర్జీలకు నాణ్యమైన పరిష్కారం ఇవ్వాలి

కలెక్టర్‌ ప్రభాకరరెడ్డి

పార్వతీపురం: ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)లో అందిన అర్జీలను సొంత సమస్యగా భావించి నాణ్యమైన పరిష్కారాన్ని ఇచ్చి అర్జీదారుల సంతప్తిని స్థాయిని పెంచాలని కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకరరెడ్డి మండల స్థాయి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో వివిధ ప్రాంతాల ప్రజలు 185 వినతులు అందజేశారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌ అర్జీలను ఆడిట్‌ చేయనున్నట్లు చెప్పారు. జిల్లా అధికారులు అర్జీలను స్వయంగా పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. నాణ్యంగా అర్జీలను పరిష్కరించకపోతే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. అర్జీలను స్వీకరించినవారిలో జాయింట్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి, సబ్‌ కలెక్టర్‌ ఆర్‌.వైశాలి, పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌, డీఆర్‌ఓ కె.హేమలత, ఎస్‌డీసీలు పి.ధర్మచంద్రారెడ్డి, ఎస్‌.దిలీప్‌ చక్రవర్తి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మైనింగ్‌ అనుమతులు నిలిపివేయాలి

పాచిపెంట మండలం శ్యామల గౌరీపురం గ్రామం సమీపంలో గల కొండకు ఉన్న మైనింగ్‌ అనుమతులను నిలిపివేయాలని కోరుతూ గ్రామంలోని ఎస్టీ గదబ కులానికి చెందిన ఎస్‌. మహేశ్వరరావు, ఎస్‌.కుమార్‌, ఎస్‌.వెంకట పాపారావు, ఎస్‌. శ్రీధర్‌తోపాటు గ్రామస్తులు వచ్చి కలెక్టర్‌ ప్రభాకరరెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. శ్యామల గౌరీపురం సమీపంలో ఉన్న కొండచుట్టూ పోడు వ్యవసాయం రాగులు, జొన్నలు, కందులు, కొర్రలు, జీడిమొక్కలు తదితర పంటలను సాగు చేసి జీవనం సాగిస్తున్నామని, కొండ ప్రాంతాన్ని పశువులు, మేకలు మేత కోసం వినియోగిస్తున్నామని, అలాగే కొండపై ఉమామహేశ్వర గోకర్ణ స్వామి ఆలయం కూడా ఉందన్నారు. ఈ కొండకు, గుడికి రాకపోకలు చేసేందుకు ప్రభుత్వం గతంలో రహదారిని కూడా నిర్మించిందని గుర్తు చేశారు. ఈ కొండకు మైనింగ్‌ అనుమతుల కోసం 18.5.2025న జాయింట్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో మైనింగ్‌ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారన్నారు. అయితే ఈ కొండ సమీపంలో ఉన్న మంచాడవలస, పణుకువలస, శ్యామల గౌరీపురం గ్రామాలకు అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సమావేశం నిర్వహించారని, కొండకు మైనింగ్‌ అనుమతులు ఇవ్వడం వల్ల ఈ గ్రామాలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని వాపోయారు. అధికారులు పునరాలోచన చేసి నవదుర్గ మైనింగ్‌కు ఇచ్చిన అనుమతులను నిలిపివేయాలని వారు కోరారు.

ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌లో వెలుగు సీఎఫ్‌పై ఫిర్యాదు

సీతంపేట: తాము తీసుకున్న ఉన్నతి రుణాలను తిరిగి చెల్లిస్తుంటే వెలుగు సీఎఫ్‌ జమచేయడం లేదని కొత్తూరు మండలంల కురిగాం గ్రామానికి చెందిన ఆదివాసీ స్వయం శక్తిసంఘం మహిళా సభ్యులు ఐటీడీఏ ఏపీఓ జి.చిన్నబాబుకు సోమవారం పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. ప్రజాసమస్యల పరిష్కారవేదికకు 27 అర్జీలను గిరిజనులు సమర్పించారు. గూనభద్రకు చెందిన చల్లా ఉమాదేవి, సుబ్బారావు తదితరులు పెండింగ్‌ హౌసింగ్‌ బిల్లులు చెల్లించాలని కోరారు. కొంకాడపుట్టి గ్రామాన్ని పంచాయతీగా గుర్తించాలని సవర శివకుమార్‌ వినతి ఇచ్చారు. పిల్లలు ఉన్నందున డబారుసింగి గ్రామానికి పాఠశాల మంజూరు చేయాలని దేవి తదితరులు కోరారు. సోదగ్రామం మండల పరిషత్‌ పాఠశాల భవనానికి మరమ్మతులు చేయించాలని పి.శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశాడు. శ్మశాసస్థలాన్ని ఆక్రమిస్తున్నారని కొండపల్లికి చెందిన ఎం.రాజారావు ఫిర్యాదు చేశాడు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి

పార్వతీపురం రూరల్‌: ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)కు వచ్చే ఫిర్యాదులను చట్టపరిధిలో నిర్దేశిత సమయంలోగా పరిష్కరించాలని ఎస్పీ ఎస్‌.వి.మాధవ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ఆయన ఫిర్యాదుదారుల నుంచి స్వయంగా అర్జీలను స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబకలహాలు, సైబర్‌ నేరాలు, ఆస్తి వివాదాలు, వడ్డీ వ్యాపారుల వేధింపులు వంటి అంశాలపై మొత్తం 11 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా ఎస్పీ సంబంధిత స్టేషన్‌ల అధికారులతో ఫోనన్‌లో మాట్లాడి, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధితులకు న్యాయం చేసి, ఆ నివేదికలను కార్యాలయానికి పంపాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ సీఐ ఆదాం, ఎస్సై రమేష్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

అర్జీలకు నాణ్యమైన పరిష్కారం ఇవ్వాలి1
1/3

అర్జీలకు నాణ్యమైన పరిష్కారం ఇవ్వాలి

అర్జీలకు నాణ్యమైన పరిష్కారం ఇవ్వాలి2
2/3

అర్జీలకు నాణ్యమైన పరిష్కారం ఇవ్వాలి

అర్జీలకు నాణ్యమైన పరిష్కారం ఇవ్వాలి3
3/3

అర్జీలకు నాణ్యమైన పరిష్కారం ఇవ్వాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement