తండ్రిని హతమార్చిన కుమారుడిపై కేసు నమోదు
పాచిపెంట: మండలంలోని తుమరవల్లి పంచాయతీ నేరళ్లవలసలో పోయిరి సోమయ్య(50) ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందగా ఈ మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. విచారణ అనంతరం ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నేరళ్లవలస గ్రామానికి చెందిన పొయిరి సోమయ్య తన పెద్ద కుమారుడు పోయిరి సింహాచలం ఇంటి వద్ద ఉండేవాడు, సోమయ్య మతిస్థిమితం కోల్పోయి తరచూ తన పెద్ద కుమారుడిని విసిగిస్తూ అసహనానికి గురి చేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ఈనెల 17వ తేదీన కూడా అలా ప్రవర్తించడంతో అసహనానికి గురైన సింహాచలం తన తండ్రి సోమయ్య ఎడమ చెవి వద్ద కర్రతో బలంగా కొట్టాడు. దీంతో సోమయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషయాన్ని పోలీసుల విచారణలో సింహాచలం అంగీకరించడంతో కేసు నమోదు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించినట్లు సాలూరు రూరల్ సీఐ రామకృష్ణ తెలిపారు.
ఇద్దరు గిరిజనులకు గాయాలు
భామిని: మండలంలోని బొడ్డగూడకు చెందిన ఆరిక రామయ్య, తులసి గ్రామానికి చెందిన మోహనరావు సోమవారం వేకువజా మున జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఒడిశాలోని పర్లాకిమిడికి వారిద్దరూ బైక్‌పై వెళ్తుండగా మంచు తాకిడికి రోడ్డు కనిపించక పోవడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. గాయపడిన వారిద్దరికీ ముందుగా పర్లాకిమిడి ఆస్పత్రిలో వైద్యసేవలు అందించిన అనంతరం ఆరిక రామయ్యను శ్రీకాకుళం రిమ్స్‌కు, మోహనరావును సీతంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఇద్దరికి గాయాలు
వీరఘట్టం: మండలంలోని సీఎస్‌పీ రహదారిలో కడకెల్ల వద్ద సోమవారం రాత్రి 9 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరఘట్టానికి చెందిన బంగారం వ్యాపారి, వైఎస్సార్‌సీపీ నాయకుడు వూణ్ణ శ్రీనివాస్ (కోణార్క్ శ్రీను), ఆర్టీసీ డ్రైవర్ శ్రీను తీవ్రంగా గాయపడ్డారు. వారిద్దరూ బుల్లెట్‌పై గరుగుబిల్లి మండల ఖడ్గవలస వెళ్లి తిరిగి వస్తుండగా కడకెల్ల వద్ద రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాలను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.ఇటీవల కొత్తగా వేస్తున్న విద్యుత్ లైన్స్ కోసం కొన్ని విద్యుత్ స్తంభాలను కడకెల్ల వద్ద రోడ్డు పక్కనే డంపింగ్ చేశారు. అయితే ఖడ్గవలస నుంచి వస్తున్న వీరు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి రోడ్డు పక్కనే డంపింగ్ చేసిన విద్యుత్ స్తంభాలను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సంఘటనా స్థలంలో ఉన్నవారు తెలిపారు. క్షతగాత్రులను వైద్య చికిత్సల కోసం పార్వతీపురం తరలించారు.
కారును ఢీకొట్టిన కంటైనర్
● త్రుటిలో తప్పిన పెనుప్రమాదం
గజపతినగరం: మండల కేంద్రంలో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదురుగా ఉన్న లక్ష్మిషాపింగ్ కాంప్లెక్స్ వద్ద జాతీయ రహదారిలో అదుపు తప్పి ఆదివారం రాత్రి పార్కింగ్‌లో ఉన్న ఓకారును కంటైనర్ బలంగా ఢీకొట్టింది. ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. విశాఖ పట్నంనుంచి రామభద్రపురం వెళ్తున్న కంటైనర్ మార్గమధ్యంలో అదుపు తప్పి గజపతినగరంలో లక్ష్మిషాపింగ్ కాంప్లెక్స్ లోకి దూసుకు పోయింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జయింది. ఆదివారం మార్కెట్ సెలవు కావడంతో అక్క జనసంచారం లేదు. లేదంటే భారీ ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు తెలిపారు.
108 డ్రైవర్ ఆత్మహత్య
పార్వతీపురం రూరల్: పదుల సంఖ్యలో ప్రాణాలను కాపాడే 108 వాహనానికి సారథిగా ఉండి, తన కుటుంబాన్ని మాత్రం ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించుకోలేక ఓ డ్రైవర్ తనువు చాలించాడు. అప్పుల బాధ తాళలేక మనస్తాపంతో గడ్డిమందు తాగి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే పార్వతీపురం పట్టణానికి చెందిన కంది గిరిప్రసాద్ (46) గడిచిన 18 ఏళ్లుగా 108 అంబులెనన్స్ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో ఈ నెల 21న విధుల్లో ఉండగానే, మల విసర్జన సాకుతో బయటకు వెళ్లి కేంద్రాస్పత్రి సమీపంలో గడ్డిమందు తాగేశాడు. ఈ విషయం గమనించి తోటి సిబ్బంది వెంటనే మెరుగైన చికిత్స కోసం విజయనగరం తరలించగా చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశాడు. మృతుడికి భార్య లక్ష్మి, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
తండ్రిని హతమార్చిన కుమారుడిపై కేసు నమోదు


