నాయనమ్మను హత్య చేసిన మనుమడి అరెస్ట్
విజయనగరం క్రైమ్: ఈ నెల 13 జరిగిన జరిగిన హత్య కేసు మిస్టరీని భోగాపురం పోలీసులు ఛేదించారు. డబ్బులు ఇవ్వలేదని సొంత నాయనమ్మనే మనుమడు హత్య చేశాడని ఎస్పీ దామోదర్ సోమవారం తెలిపారు. ఈ కేసుకు సంబంధించి విలేకరుల సమావేశంలో ఎస్పీ దామోదర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని భోగాపురం మండలం ముడసలపేట గ్రామం ఎయిర్ పోర్టు కాలనీకి చెందిన ముడసల అప్పయ్యమ్మ (70) అనే వృద్ధురాలిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి, ఆమె ఒంటిపై ఉన్న బంగారు చెవి దిద్దులు, జుమ్మలు, ముక్కు కమ్ములు, వెండి పట్టీలను దొంగిలించుకుని పోయారని మృతురాలి కోడలు ముడసల లక్ష్మి డిసెంబర్ 13న ఫిర్యాదు చేసింది.ఈ మేరకు భోగాపురం పోలీసులు కేసు నమెదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు విచారణలో భాగంగా, నేర స్థలాన్ని క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు పరిశీలించాయి. విజయనగరం ఇన్‌చార్జ్ డీఎస్పీ ఆర్.గోవిందరావు ఆధ్వర్యంలో భోగాపురం సీఐ కె.దుర్గాప్రసాద్, ఎస్సై పి.పాపారావు, సీసీఎస్ ఎస్సై కె.లక్ష్మణరావు బృందాలుగా ఏర్పడి. విచారణ చేపట్టారు. నేర స్థలం పరిశీలనలో డాగ్‌స్క్వాడ్. నిందితుడు ముడసల గౌరి చుట్టూ తిరగడంతో అనుమానంతో అతని కదలికలపై నిఘా పెట్టారు.
బంగారం, వెండి రికవరీ
నేరం జరిగిన కొద్ది రోజుల తర్వాత, పోలీసులకు అనుమానం లేదని నిందితుడు ముడసల గౌరిపై భావించి, దొంగిలించిన వస్తువులను అమ్మేయాలన్న ఉద్దేశంతో వాటిని తీసుకుని వెళ్తుండగా భోగాపురం పోలీసులు అరెస్టు చేసి, 18.250 గ్రాముల బంగారు వస్తువులను, 106 గ్రాముల వెండి పట్టీలను రికవరీ చేశారని ఎస్పీ దామోదర్ తెలిపారు. విచారణలో మృతురాలు తన కుమార్తె, చిన్న కుమారుడికి తన వద్ద ఉన్న డబ్బులు ఇస్తున్నట్లు, పెద్ద కుమారుడి కుటుంబానికి డబ్బులు ఇవ్వడం లేదన్న కారణంగా ఆమైపె కక్ష పెంచుకున్నాడన్నారు. ముందు రోజు రాత్రి పెద్ద కొడుకు కొడుకై న గౌరి మద్యం మత్తులో తన నాయనమ్మను బైక్ ఫైనాన్స్ కట్టేందుకు డబ్బులు అడిగాడని, ఇవ్వకపోవడంతో ఆమె ముఖంపై తలగడతో అదిమి హత్య చేసి, ఒంటిపైగల చెవి కమ్ములు, జుమ్మాలు, చెవి మద్య రింగులు, రోల్డ్ గోల్డ్ చైన్, వెండి పట్టీలను దొంగిలించాడన్నారు. మృతురాలు బహిర్భూమికి బయటకు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి, మృతురాలి ఒంటిపై బంగారు వస్తువులు తీసుకుని పోయినట్లు మభ్యపెట్టేందుకు మృతదేహాన్ని ఇంటినుంచి బయటకు తీసుకు వెళ్లి, నూతికి సమీపంలో పడేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని, లాభాపేక్షతో హత్య కేసు మిస్టరీని చేధించామన్నారు. ఈ కేసులో క్రియాశీలకంగా పని చేసిన డీఎస్పీ ఆర్.గోవిందరావు, భోగాపురం సీఐ కె.దుర్గా ప్రసాద్, ఎస్సైలు పి.పాపారావు, కె.లక్ష్మణరావు, ఏఎస్సై గౌరీ శంకర్, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బందిని అభినందించి నగదు రివార్డులను ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ప్రదానం చేశారు.


