రాష్ట్రానికి ఆదర్శంగా మన్యం జిల్లా
పార్వతీపురం: పరిపాలనలో, ప్రజాసమస్యల పరిష్కారంలో పార్వతీపురం మన్యం జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తుందని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అన్నారు. కలెక్టర్ల సమావేశంలో జిల్లా సాధించిన ప్రగతిని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించిన నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, సబ్‌కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు గజమాలతో కలెక్టర్‌ను సత్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన ముస్తాబు కార్యక్రమం అద్భుత ఫలితాన్ని ఇచ్చిందన్నారు. విద్యార్థుల్లో పరిశుభ్రత, క్రమశిక్షణ, సంస్కారాన్ని పెంపొందించేందుకు ఇది ఒక గొప్ప సంకల్పమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలు, వసతిగృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించడం మన జిల్లాకు దక్కిన గొప్ప గౌరవమన్నారు. పీజీఆర్‌ఎస్ సమస్యల పరిష్కారంలో పార్వతీపురం జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలవడం ఎంతో అభినందనీయమన్నారు. రెవెన్యూ క్లినిక్ విధానాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడం గర్వకారణమన్నారు. ఇదే స్ఫూర్తితో పనిచేసి జిల్లా అన్ని రంగాల్లో ముందుండేలా చూడాలని సిబ్బందిని కోరారు. కార్యక్రమంలో జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, పార్వతీపురం, పాలకొండ సబ్‌కలెక్టర్లు వైశాలి, పవర్ స్వప్నిల్ జగన్నాథ్, డీఆర్‌ఓ హేమలత, హౌసింగ్ పీడీ ధర్మచంద్రారెడ్డి తదితరులున్నారు.
వినియోగదారుల హక్కులపై
అవగాహన కలిగి ఉండాలి
వస్తువులు కొనుగోలు, సేవల వినియోగం విషయంలో ప్రజలు అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి హితవు పలికారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వినియోగదారుల హక్కులు, ప్రమాణాలకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్వతీపురం, పాలకొండ సబ్‌కలెక్టర్లు వైశాలి, పవర్ స్వప్నిల్ జగన్నాథ్, డీఆర్‌ఓ హేమలత, డీఆర్‌డీఏ పీడీ సుధారాణి, హౌసింగ్ పీడీ ధర్మచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


