అరకొరగా దాణా..
నేను రెండు ఆవులు పోషిస్తున్నాను. ఏప్రిల్ నెలలో ఒక బస్తా సమీకృత దాణా ఇచ్చారు. ఇప్పుడు బతిమాలి నెట్ వద్ద కాచుకుని కూర్చుంటే మరో బస్తా వచ్చింది. ఇలా అయితే, పశుపోషణ భారంగా మారుతుంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పశుదాణాకు, పశువైద్యానికి ఇబ్బంది ఉండేది కాదు.
– కె.లక్ష్మణరావు, పాడిరైతు, ఇట్లామామిడిపల్లి
ప్రైవేటు దుకాణాలను ఆశ్రయిస్తున్నాం..
చంద్రబాబు ప్రభుత్వం పశువులకు సరిపడా పశుదాణా రాయితీపై సరఫరా చేయడంలేదు. విశాఖ డెయిరీ, లేదంటే ప్రైవేటు దుకాణాల్లో దాణాను అధిక డబ్బులకు కొనుగోలు చేస్తున్నాం. పాలు విక్రయించగా వచ్చిన డబ్బులలో సగం కంటే ఎక్కువ పశుదాణాకు ఖర్చుపెడుతున్నాం. రైతుకు ఏమీ మిగలడం లేదు. పశుపోషణ భారంగా మారుతోంది. ప్రభుత్వం పశుదాణా, మందులు కొరత లేకుండా సరఫరా చేయాలి.
– సీహెచ్ ఈశ్వరరావు, పాడిరైతు, రామభద్రపురం
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా..
ప్రభుత్వం బడ్జెట్ మేరకు పశుదాణా 50 శాతం రాయితీపై అందిస్తుంది. రైతులకు అలవాటు చేద్దామని సరఫరా చేస్తుంది. పూర్తి స్థాయిలో సరఫరా చేయాలంటే బడ్జెట్ ఎక్కువ అవుతుంది. రైతులు ఇంకా కావాలని అడుగుతున్నారు. కొరత విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను. పశువైద్యశాలలో మందులు అందుబాటులో ఉన్నాయి. – కె.మురళీకృష్ణ,
పశుసంవర్థక శాఖ జేడీ, విజయనగరం
● సర్కారు నిర్లక్ష్యం.. పాడి రైతుకు శాపం
● రాయితీపై అరకొరగా పశుదాణా సరఫరా
● భారమైన పశుపోషణ
● ఆవేదనలో పాడిరైతులు
రామభద్రపురం:
రైతు కుటుంబాలకు వ్యవసాయం తర్వాత పశుపోషణ ప్రత్యామ్నాయ ఉపాధిమార్గం. విపత్తుల సమయంలో ఆదుకునేది కూడా పాడిపరిశ్రమే. చంద్రబాబు ప్రభుత్వం పాడి రైతులపై చూపుతున్న కపటప్రేమ ఇబ్బందులకు గురిచేస్తోంది. అన్ని పథకాలకు కోతపెట్టిన సర్కారు రాయితీపై పశుదాణాను సైతం అరకొరగా అందజేస్తుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. పశుపోషణకు ఇబ్బందులు పడుతున్నారు. దాణాఖర్చులు భరించలేక పశువులను అమ్ముకునే పరిస్థితి దాపురించిందంటూ గగ్గోలు పెడుతున్నారు.
ఇదీ పరిస్థితి...
జిల్లాలో పాడి ఆవులు 3,77,960, గేదెలు 97,845 ఉన్నాయి. పాడి రైతులు గేదెలు, ఆవులను పోషిస్తూ పాలను డెయిరీలకు విక్రయించి వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తున్నారు. పాలఉత్పత్తి పెరగాలంటే నాణ్యమైన దాణా అవసరం. చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం పాడి రైతులకు శాపంగా మారింది. జిల్లాలోని పాడి రైతులకు ఏప్రిల్‌లో మొదటి దఫాగా 430 టన్నులు 50 శాతం రాయితీపై సమీకృత పశుదాణా సరఫరా చేశారు. ఏడు నెలలు తర్వాత నవంబర్ నెలలో రెండో దఫాగా మరో 430 టన్నులు మాత్రమే సరఫరా చేశారు. ఒక్కోపాడి ఆవు లేదా గేదెకు రోజుకు సుమారు 4 కిలోలు దాణా అవసరం. రైతుకు ఎన్ని ఆవులు ఉన్నా.. ఎన్ని గేదెలు ఉన్నా ఒక్కో రైతుకు 50 కిలోల బస్తా ఒకటిచొప్పునే అందిస్తున్నారు. ఆ బస్తా దాణాకు కూడా గంటల తరబడి రైతులు నెట్ సెంటర్ల వద్ద కూర్చొని పేరు నమోదు చేయాలి. లేదంటే ఆ బస్తా దాణా కూడా అందని పరిస్థితి. రాయితీపై అందజేసే పశుదాణాకు కోత పెట్టడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
మందులకూ కొరతే..
చంద్రబాబు ప్రభుత్వం పశువైద్య శాలలకు మందులు అరకొరగా సరఫరా చేస్తోంది. రైతు సేవా కేంద్రాలకు మందుల సరఫరాను పూర్తిగా నిలిపివేసింది. పశువులకు మేగ్లూమిన్, మెలోక్సి కామ్ వంటి నొప్పి నివారణ మందులు, ఆక్సిట్రాసైక్లిన్, ఎన్రోఫ్లోక్ససిన్, పెన్సిలిన్ వంటి యాంటీబయోటిక్స్, గాయాలకు రాసే ఆయింట్‌మెంట్లు, అవిల్ వంటి ఎలర్జీ నివారణ మందులు, జీర్ణశక్తి పెంపొందించే టానిక్స్, చూడి కట్టడానికి హార్మోన్స్ వంటివి అత్యవసరం. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆర్‌బీకేల్లో ఇండెంట్ పెట్టుకునే అవకాశం కల్పించి పూర్తిస్థాయిలో మందులు సరఫరా చేసిది. ఇప్పుడు ఆ పరిస్థితి లేక ఆర్‌ఎస్‌కేల సిబ్బంది సంబంధిత పశువైద్యశాలకు వెళ్లి మందులు తెచ్చుకోవాలి. అక్కడ లేకపోతే పల్లెల్లో పశు వైద్యసేవలందిస్తూ బయట కొనుగోలు చేసి తెచ్చుకోవాలని పాడిరైతులకు చీటీ రాసి ఇస్తున్నారు.
అరకొరగా దాణా..
అరకొరగా దాణా..
అరకొరగా దాణా..
అరకొరగా దాణా..


