వృద్ధుల పట్ల వివక్ష..!
సమాచారం లేదు..
వయస్సు నిర్ధారణ ధ్రువీకరణ పత్రం కోసం 3,733 మంది జాబితాను డీఆర్‌డీఏ అధికారులు అందించారు. వాటిని మిగతా ప్రభుత్వాస్పత్రులకు కేటాయించాలని డీఆర్‌డీఏ అధికారులకు ఈ ఏడాది జూలై 9న లేఖ రాశాం. వారి నుంచి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం రాలేదు.
– డాక్టర్ అల్లు పద్మజ, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి
విజయనగరం ఫోర్ట్:
వృద్ధాప్య పింఛన్‌కు వయసు నిర్ధారణ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. ఆధార్ కార్డులో వయస్సు తక్కువగా నమోదై.. వాస్తవ వయస్సు ఎక్కువగా ఉన్నవారు జిల్లాలో వేలాది మంది ఉన్నారు. వీరిలో 3,733 మంది వృద్ధులు వయసు నిర్ధారణ ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకున్నారు. సుమారు రెండేళ్లవుతున్నా ఏ ఒక్కరికీ ఇంతవరకు అధికారులు ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయలేదు.
ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, డీఆర్‌డీఏ అధికా రులు ఒకరిపై ఒకరు తప్పును నెడుతున్నారే తప్ప వృద్ధులకు న్యాయం చేయడం లేదు. రెండు శాఖల మధ్య సమన్వయ లోపం వృద్ధుల పాలిట శాపంగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 6 నెలలకు ఒకసారి అన్ని రకాల పింఛన్లు మంజూరు చేసేది. 2024 జనవరి నెలలో కూడా ఫించన్లు మంజూరు చేసింది. సకాలంలో వయసు నిర్ధారణ ధ్రువీకరణ పత్రం జారీచేయకపోవడంతో పింఛన్లకు దూరమయ్యామని వాపోతున్నారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం కొత్తపింఛన్ల మంజూరు అంశమే పట్టించుకోవడంలేదని ఆవేదన చెందుతున్నారు.
‘విజయనగరం పట్టణంలోని దాసన్నపేటకు చెందిన కె.సూర్యనారాయణ అనే వృద్ధుడికి 60 ఏళ్లకు పైబడి వయస్సు ఉంటుంది. కానీ అతని ఆధార్ కార్డులో వయసు తక్కువగా నమోదైంది. వృద్ధాప్య పింఛన్ పొందేందుకు తనకు వయసు నిర్ధారణ పత్రం మంజూరు చేయాలని 2023 నవంబర్ నెలలో దరఖాస్తు చేసుకున్నాడు. అధికారులు ఇంతవరకు అతనికి వయసు నిర్ధారణ ధ్రువీకరణ పత్రం మంజూరు చేయలేదు. ఇటీవల ఆ వృద్ధుడు మరణించాడు.’
‘గంట్యాడ మండలం పెదవేమలి గ్రామానికి చెందిన సీహెచ్ నారంనాయుడు అనే వృద్ధుడు రెండేళ్ల కిందట వయసు నిర్ధారణ ఽధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అతనికి కూడా ఇంతవరకు వయసు నిర్ధారణ పత్రం మంజూరు చేయలేదు. ఫలితంగా వృద్ధాప్య పింఛన్‌కు దూరమయ్యాడు.’


