ముట్టుకుంటే సాక్ష్యం మాయం
● దోషులకు అదే సాయం
● జిల్లాకు 2 కొత్త క్రైమ్ స్పాట్ వాహనాలు
● చక్రాలపై నడిచే ‘ల్యాబ్’లు
పార్వతీపురం రూరల్: దొంగతనం జరిగిందని తెలియగానే కంగారులో బీరువాలన్నీ తెరిచి చూడడం..అనుమానాస్పదంగా ఎవరైనా చనిపోతే మృతదేహాన్ని కదిలించడం..ఆత్రుతతో ఘటనా స్థలమంతా కలియదిరగడం..చాలామంది చేసే పనులివే. కానీ, మనకు తెలియకుండానే మనం చేసే ఈ చిన్న పొరపాట్లు నేరస్తులను రక్షిస్తున్నాయి. బాధితులకు న్యాయం జరగడంలో జాప్యానికి కారణమవుతున్నాయి. నేర పరిశోధనలో ఇప్పుడు శాసీ్త్రయత పెరిగింది. ఇటీవల జిల్లాలో అందుబాటులోకి వచ్చిన ‘క్రైమ్ స్పాట్ వాహనాలు’, ‘క్లూస్ టీం’ పనితీరుపై ప్రజలకు కనీస అవగాహన ఉంటేనే నేరాలను ఛేదించడం సులభమవుతుంది. అసలు ఈ వ్యవస్థ ఏం చేస్తుంది? ప్రజలు ఏం చేయాలి? అనేదానిపై ప్రత్యేక కథనం.
మూగ సాక్ష్యాలతోనే నేరస్తులకు సంకెళ్లు
ఏ నేరస్తుడైనా సరే నేరం చేసేటప్పుడు ఏదో ఒక చిన్న ఆధారాన్ని కచ్చితంగా వదిలి వెళ్తాడు. దాన్ని పసిగట్టడమే క్లూస్ టీం పని. బీరువా హ్యాండిల్స్, తలుపులు, లాకర్లపై దొంగల వేలిముద్రలను ఈ బృందం రసాయనాలను వాడి వెలికితీస్తుంది. ఘటనాస్థలంలో పడిన రక్తపు చుక్కలు, నిందితుడు వాడిన ఆయుధాలు, పెనుగులాటలో రాలిన వెంట్రుకలు కీలక సాక్ష్యాలుగా మారుతాయి. ఉరివేసుకున్న కేసుల్లో అది ఆత్మహత్యా? లేక హత్య చేసి ఉరివేశారా? అనేది తాడు ముడివేసిన విధానం, మృతదేహం స్థితిని బట్టి క్లూస్ టీం అంచనా వేస్తుంది.
జాగ్రత్తే.. న్యాయానికి తొలిమెట్టు
పోలీసుల వద్ద ఎంత అత్యాధునిక వాహనాలు, సాంకేతికత ఉన్నా.. నేరం జరిగిన మొదటి గంటలో ప్రజలు ప్రదర్శించే స్పందన మీదే కేసు భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ‘క్రైమ్ సీన్’ను ఎంత పవిత్రంగా(పాడు చేయకుండా) ఉంచితే.. నేరస్తుడు అంత త్వరగా పట్టుబడతాడు. చివరిగా మీ ప్రాంతంలో ఏదైనా నేరం జరిగితే..ఆత్రుతను ఆపుకుని క్లూస్ టీం వాహనం వచ్చే వరకు ఆ ప్రదేశాన్ని రక్షించాలి. అదే బాధితులకు చేసే అతిపెద్ద సహాయం.
వాహనాలు కాదు..
సంచార ప్రయోగశాలలు
ఒకప్పుడు నేరం జరిగిన ప్రదేశంలో దొరికిన వస్తువులను సీజ్ చేసి ల్యాబ్‌కు పంపేవారు. కానీ ఇప్పుడు ఆ ల్యాబ్ నేరుగా ఘటనా స్థలానికే వస్తోంది. ఇటీవల ప్రవేశపెట్టిన ‘క్రైమ్ స్పాట్ వాహనాలు’ అత్యాధునిక సాంకేతికతను కలిగి ఉన్నాయి.
ఏం చేస్తాయంటే?
ఘటనా స్థలంలో ఉండే కంటికి కనిపించని వేలిముద్రలు, రక్తం మరకలు, వెంట్రుకలు, డీఎన్‌ఏ నమూనాలను సేకరించే కిట్లు ఇందులో ఉంటాయి.
ఆధారాల భద్రత
సాక్ష్యాలు చెడిపోకుండా అక్కడికక్కడే ప్యాక్ చేయడానికి, డిజిటల్ డాక్యుమెంటేషన్ చేయడానికి ఇందులో ఏర్పాట్లు ఉంటాయి.
ఈ తప్పులు చేయకండి!
దొంగతనం జరిగిన ఇంట్లో వస్తువులను, తలుపు గొళ్లాలను, గ్లాసులను అస్సలు తాకకూడదు. వాటిని తాకిన వారి వేలిముద్రలు పడి, దొంగ వేలిముద్రలు చెరిగిపోయే ప్రమాదం ఉంది. హత్య జరిగిన ప్రదేశంలో గానీ, ఆత్మహత్య చేసుకున్న ప్రదేశంలో గానీ మృతదేహాన్ని, పక్కన ఉన్న వస్తువులను కదల్చకూడదు. వస్తువులు పడి ఉన్న తీరును బట్టి నేరం ఎలా జరిగిందో రీ–కనన్‌స్ట్రక్షన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఘటన జరిగిందని తెలియగానే వందలమంది గుమిగూడి ఆ ప్రదేశమంతా తొక్కేస్తుంటారు. దీనివల్ల నిందితుడి పాదముద్రలు నాశనమవుతాయి. అలాగే డాగ్ స్క్వాడ్ (పోలీస్ కుక్కలు) వాసన పసిగట్టడం కష్టమవుతుంది. ఒకవేళ ఆరుబయట మృతదేహం లేదా ఆధారాలు ఉంటే..వర్షం వస్తే అవి తడవకుండా ప్లాస్టిక్ కవర్లతో కప్పాలి. కానీ వాటిని తాకకుండా జాగ్రత్త పడాలి.
ఆధారాలు భద్రంగా ఉంటేనే న్యాయం
ఏదైనా నేరం జరిగినప్పుడు ప్రజలు ఆవేశంతోనో, ఆతృతతోనో ఘటనా స్థలంలోకి ప్రవేశించి అక్కడి వస్తువులను తాకడం వల్ల దర్యాప్తుకు తీవ్ర విఘాతం కలుగుతుంది. జిల్లాలో ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో కూడిన ‘క్రైమ్ స్పాట్ వాహనాలు’ పాలకొండ, పార్వతీపురం డివిజన్ లకు నిరంతరం అందుబాటులో ఉన్నాయి. నేరస్తులు వదిలిన అతి చిన్న క్లూను కూడా గుర్తించి, శాసీ్త్రయంగా విశ్లేషించే సామర్థ్యం ఈ క్లూస్ టీంకు ఉంది. కాబట్టి, పోలీసులు వచ్చే వరకూ ‘క్రైమ్ సీన్’ను ఎవరూ డిస్టర్బ్ చేయకుండా కాపాడాలి. ఆధారాలు భద్రంగా ఉంటేనే నేరస్థులకు శిక్ష పడుతుంది. ఈ విషయంలో ప్రజలు సహకరిస్తే, ఎంతటి క్లిష్టమైన కేసునైనా సాంకేతిక ఆధారాలతో ఛేదించి, బాధితులకు త్వరితగతిన న్యాయం అందించగలం. –ఎస్‌వీ మాధవ్ రెడ్డి, ఎస్పీ, పార్వతీపురం మన్యం
ముట్టుకుంటే సాక్ష్యం మాయం


