ఆత్మగౌరవానికి ప్రతీక రాజ్యాంగం
విజయనగరం: భారతీయుల ఆత్మగౌరవానికి భారత రాజ్యాంగం ప్రతీక అని, అత్యంత పవిత్రమైనదని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి డాక్టర్ ఎ.కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు భారత రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లాశాఖ అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్ ఆధ్వర్యంలో గురజాడ పాఠశాలలో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సదస్సులో కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ మన రాజ్యాంగం సార్వభౌమ, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగమని, ప్రపంచంలో అతి పెద్ద లిఖిత రాజ్యాంగం మనదేనన్నారు. గురుప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ స్వరూప స్వభావాన్ని తెలిపే లిఖిత పత్రం రాజ్యాంగమని పేర్కొన్నారు. రాజ్యాంగమంటే స్వేచ్ఛ, సమానత్వం సోదరభావాలు, మూలస్తంభాలుగా దేశ ప్రజల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షించే సమున్నత ఆశయమని అన్నారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ గోటేటి హిమబిందు, జనవిజ్ఞాన వేదిక జాతీయ నాయకుడు డాక్టర్ కృష్ణాజీ, రాష్ట్ర కోశాధికారి డాక్టర్ పైలా రమేష్ రాజులు మాట్లాడుతూ అన్ని తరగతుల ప్రయోజనాలు రక్షించే ధృక్పథం మన భారత రాజ్యాంగం కలిగి ఉందన్నారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.సుభద్రాదేవి, న్యాయవాది పీబీఎస్ పవిత్ర, పాఠశాల కరస్పాండెంట్ ఎం.స్వరూప, ప్రిన్సిపాల్ పూడి శేఖర్, రచయిత కాగుపాటి నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి


