స్కూళ్లకు ఫోర్టిఫైడ్ రైస్ సరఫరా బంద్?
● రేషన్‌డిపోలకు వెళ్లి తీసుకోవాల్సిందే
● కష్టమంటున్న ఎండీఎం కార్మికులు
● గతంలో నేరుగా పాఠశాలలకే సరఫరా
సీతంపేట: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా నేరుగా పాఠశాలలకు ఫోర్టిఫైడ్ బియ్యం సరఫరా చేసేవారు. ఎటువంటి సమస్యలు లేకుండా సకాలంలో మధ్యాహ్న భోజనం వంటకం దారులు విద్యార్థులకు వండి వడ్డించేవారు. గత నెల నుంచి కూటమి ప్రభుత్వం పాఠశాలలకు సప్‌లై చేయకుండా రేషన్‌డిపోలకు మాత్రమే పరిమితం చేసి చేతులెత్తేసింది. కుయ్యోమొర్రో అంటూ ఎండీఎం కార్మికులు రేషన్‌డిపోలకు ప్రతి నెలా వెళ్లి పాఠశాలలకు బియ్యం తెచ్చుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. సీతంపేట ఏజెన్సీలో స్కూల్ పాయింట్‌కు వచ్చి ఫోర్టిఫైడ్ రైస్ సప్‌లై చేయకుండా పాఠశాలకు సమీపంలో ఉన్న రేషన్‌డిపోలో బియ్యం వేస్తున్నారు. దీంతో మధ్యాహ్న బోజనం వంటకం దారులతో పాటు ఆయా పాఠశాలల హెచ్‌ఎంలకు కొత్త తలనొప్పి వచ్చి పడింది. పాఠశాలకు దగ్గర్లో ఉన్న రేషన్‌డిపోకు బియ్యాన్ని పంపించి అక్కడ తీసుకోవాలంటూ సంబంధిత అధికారులు చెప్పడంతో మళ్లీ కథ మొదటకొచ్చిందని వారంతా వాపోతున్నారు. మండలంలో 152 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వాటి పరిధిలో సుమారు 7 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వారందరికీ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ప్రతి నెలా 18 నుంచి 22 క్వింటాళ్ల బియ్యం ఆ నెల విద్యార్థుల సంఖ్యను బట్టి వండి వడ్డించడానికి అవసరమవుతాయి. నిబంధనల ప్రకారం ఈ బియ్యాన్ని పాఠశాలలకు సరఫరా చేసి అక్కడ జియోట్యాగింగ్ చేయాల్సి ఉంది. ఈనెల నుంచి అలా కాకుండా రేషన్‌డిపోలో ఈ బియ్యాన్ని ఇచ్చేసి అక్కడి నుంచి తీసుకోవాలని అధికారులు ఆదేశించడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో పాఠశాల యాజమాన్యాలు ఉన్నాయి. బియ్యం రేషన్ డిపోల నుంచి తీసుకోవాలంటే ఆటోలో, ఇతర వాహనాల్లో తేవాల్సి ఉంది. దాదాపు రూ.300 నుంచి రూ.500 వరకు దూరాన్ని బట్టి చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ రవాణా చార్జీలు ఎవరిస్తారనేది ప్రశ్నార్థకంగా నిలుస్తోంది. నెలల తరబడి సక్రమంగా వేతనాలు లేక అవస్థలు పడుతున్న తామెలా తీసుకువస్తామని ఎండీఎం కార్మికులు వాపోతున్నారు. క్వింటాకు రూ.24 మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుందని, పైగా మారుమూల గ్రామాలకు లారీలు, వ్యాన్‌లు వెళ్లాలంటే కష్టసాధ్యమైన పని అని అందుకే రేషన్‌డిపోల్లో బియ్యాన్ని ఇచేస్తున్నామని అక్కడి నుంచి తీసుకోవాలని సంబంధిత పౌరసరఫరాల శాఖ సిబ్బంది చెప్పుకొస్తున్నారు. కొన్నేళ్లుగా పాఠశాలలకు పంపిణీ చేసి ఇప్పుడు నిలిపివేయడం తగదని పాఠశాల యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి. మైదాన ప్రాంతాల్లో పాఠశాలలకు నేరుగా పాఠశాలలకు పంపిణీ చేస్తున్నారు. సీతంపేట ఏజెన్సీలో మాత్రం గత నెల నుంచి నిలిపివేయడం పట్ల ఎండీఎం కార్మికులు, విద్యార్థుల తల్లిదండ్రులు అసంతృప్తి చెందుతున్నారు. కొద్ది రోజుల కిందట జేసీ,సబ్‌కలెక్టర్‌కు సైతం పిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని వాపోతున్నారు.
దగ్గర్లో ఉన్న డిపోల్లో అందజేస్తాం
లారీలు మారుమూల ప్రాంతాలకు వెళ్లలేకపోవడంతో ఈ సమస్య ఉత్పన్నమైంది. సంబంధిత కాంట్రాక్టర్లు గతంలో పనిచేసిన జేసీ దృష్టిలో పెట్టారు. మెయిన్‌రోడ్డు పక్కన ఉన్న హైస్కూల్‌కు మాత్రం నేరుగా బియ్యం సరఫరా చేస్తున్నారు. సీతంపేట, కురుపాం మండలంలోని పలు మారుమూల పాఠశాలలకు ఫోర్టిఫైడ్ రైస్ సప్‌లై చేయలేని పరిస్థితి ఉన్నమాట వాస్తవమే. రేషన్‌డిపోలకు మాత్రం పంపిణీ చేస్తున్నాం. అక్కడి నుంచి పాఠశాలల యాజమాన్యం తీసుకువెళ్లాల్సి ఉంటుంది.
శ్రీవిద్య, సీఎస్‌డీటీ, సీతంపేట


