
ఇది రిగ్గింగ్ గెలుపు
● జెడ్పీ చైర్మన్
మజ్జి శ్రీనివాసరావు
విజయనగరం అర్బన్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి ఓర్వలేకే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అధికార బలంతో రిగ్గింగ్ చేసి గెలిచారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆరోపించారు. కలెక్టరేట్‌లో గురువారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎంత అపహాస్యం అయిందో పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలే నిలువెత్తు నిదర్శనమన్నారు. పులివెందులలో గెలచామని చెప్పుకునేందుకు అన్నిరకాల కుట్రలు పన్నారని దుయ్యబట్టారు. అక్రమ అరెస్టులతో పాటు బరిలో నిలిచే అభ్యర్థి సైతం ఓటువేయలేని పరిస్థితిని సృష్టించారన్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను జీర్జించుకోలేక, వ్యతిరేకత లేదని చెప్పుకోవడానికి ఇలాంటి అప్రజాస్వామిక ఘటనలకు పాల్పడడం విచారకరమన్నారు. కలెక్టర్ దగ్గరుండి చేయిస్తున్న ఓట్ల రిగ్గింగ్ ఫొటోను ట్వీట్ నుంచి తొలగించి రిగ్గింగ్ అంగీకరించారని ఆరోపించారు. ఏడాది కాలంలోనే ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి పాలన అందించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పులివెందుల ఒక్కటే కాదు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్నింటినీ ఒకేసారి ప్రజాసామ్యబద్ధంగా ఎన్నికలు జరిపితే ఫలితాలు ఎలా ఉంటాయో తెలుస్తుందన్నారు.