
ప్రపంచ దేశాల్లో భారత్ అగ్రరాజ్యంగా ఎదగాలి
● విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
● జిల్లా పరిషత్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ
విజయనగరం: అనేక సవాళ్లను ఎదుర్కొంటూ అభివృద్ధి పథంలో ముందంజలో ఉన్న భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యంగా ఎదగాలని ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆకాంక్షించారు. జెడ్పీ కార్యాలయంలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసి జెండా వందనం చేశారు. అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటీష్ వలసపాలకులను తరిమికొట్టి స్వాతంత్య్రసాధనలో సమరయోధుల స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనేక కులాలు, మతాలు, జాతులు, భాషలు, సంస్కృతులు కలిసి ఉన్న భారత దేశం ప్రపంచ దేశాల చూపును ఆకర్షించే స్థాఽయికి ఎదిగిందన్నారు. దేశ పౌరులంతా కలిసిమెలసి అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. అనంతరం కారుణ్యనియామకాల్లో భాగంగా ముగ్గురు జూనియర్ అసిస్టెంట్‌లు, ఇద్దరు ఆఫీస్ అసిస్టెంట్‌లకు నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీలు వర్రి నర్సింహమూర్తి, శాంతకుమారి, కెల్ల శ్రీనివాసరావు, జిల్లా పరిషత్ సీఈఓ బీవీవీ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.