
మత్స్యకారులకు బయోమెట్రిక్ కార్డులు తప్పనిసరి
విజయనగరం అర్బన్: తీరప్రాంత రక్షణకు పటిష్ట ఏర్పాట్లు చేస్తామని, మత్స్యకారులకు బయోమెట్రిక్ కార్డులు తప్పనిసరని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు. తీరప్రాంత భద్రతపై కలెక్టర్ చాంబర్‌లో బుధవారం భద్రతా కమిటీ సమావేశం జరిగింది. తీరప్రాంత భద్రతపై కమిటీ పలు ప్రతిపాదనలు చేసింది. విజయనగరం జిల్లాలో 29 కిలోమీటర్ల తీరప్రాంతం ఉందని, దాని కోసం రహదారి ఏర్పాటు, భద్రతా సిబ్బంది గస్తీకి వీలుగా వాచ్‌టవర్, సముద్రం వెంబడి గస్తీ కోసం రెండు వాహనాలు, 16 సీసీ కెమెరాలు ఏర్పాటుకు కమిటీ ప్రతిపాదించింది. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ బీచ్ కారిడార్ పనుల్లో భాగంగా మన తీరం వెంబడి 29 కిలోమీటర్ల రహదారి కోసం ప్రతిపాదిస్తామని చెప్పారు. తీర ప్రాంత గస్తీ కోసం రెండు వాహనాలు ఒక్కో తీరప్రాంతానికి ఒక వాచ్ టవర్‌ను సీఎస్‌ఆర్ నిధుల నుంచి సమకూరుస్తామని చెప్పారు. సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో తీర భద్రత విభాగం విశాఖపట్నం డీఎస్పీ ఎ.ఎం.శ్రీనివాసరావు, తూర్పు తీర నావికాదళ లెఫ్ట్‌నెంట్ కమాండర్ స్వప్నిల్ చౌహాన్, సీనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఎ.వరప్రసాద్, ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ వెంకటేష్ నాయుడు, మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ విజయకృష్ణ, కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బీవీజీ రాజు పాల్గొన్నారు.