
ముగ్గురు అధికారులపై కలెక్టర్ ఆగ్రహం
● సెలవు అనుమతి లేకుండా
జిల్లా దాటివెళ్తే చర్యలు
● ప్రజల అర్జీలకు వెంటనే పరిష్కారం చూపాలి
విజయనగరం అర్బన్: సెలవు అనుమతి లేకుండా జిల్లా దాటి వెళ్లే జిల్లా అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ డాక్టర్ బీఆర్‌అంబేడ్కర్ స్పష్టం చేశారు. ఈ మేరకు కలెక్టరేట్‌లోని సమావేశ భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో అధికారులను హెచ్చరించారు. సెలవు మంజూరు చేయకుండా సంక్షేమ శాఖ అధికారిణి పీజీఆర్‌ఎస్‌కు గైర్హాజరు అవడంపై సీరియస్ అయ్యారు. అదే విధంగా సమయపాలన పాటించకుండా పీజీఆర్‌ఎస్‌కు ఆలస్యంగా హాజరైన డీఎంహెచ్‌ఓ జీవనరాణిపై కలెక్టర్ ఆగ్రహించారు. బాధ్యతా రాహిత్యంగా విధులు నిర్వహించిన కారణంగా మరో అధికారి ఐసీడీఎస్ పీడీ విమలారాణిపై సీరియస్ అయి సరెండర్ ఉత్తర్వులు ఇవ్వమని డీఆర్‌ఓను ఆదేశించారు. జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో అంగన్‌వాడీ పిల్లలకు సోమవారం సెలవు ఇవ్వాలని ఆదివారం రాత్రి కలెక్టర్ స్వయంగా ఇచ్చిన సెల్ మెసేజ్‌ను 24 గంటల వరకు ఐసీడీఎస్ పీడీ చూడలేదు. దీన్ని సీరియస్‌గా తీసుకుని ఈ ఆదేశాలు జారీచేశారు.
ప్రజల అర్జీలకు వెంటనే పరిష్కారం చూపాలి
కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ బీఆర్‌అంబేడ్కర్, డీఆర్‌ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, డిప్యూటీ కలెక్టర్‌లు వెంకటేశ్వరరావు, ప్రమీలాగాంధీ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన అర్జీలకు వెంటనే పరిష్కారం చూపాలని అర్జీలపై తీసుకున్న చర్యలను నిర్ణీత గడువులోగా అర్జీదారులకు తెలియజేయాలని ఆదేశించారు. అర్జీలు రీ ఓపెన్ కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పీజీఆర్‌ఎస్‌లో ప్రజలు సామాజిక, వ్యక్తిగత అంశాలపై 94 అర్జీలు అందజేశారు.
ఎస్పీ పీజీఆర్‌ఎస్‌కు 27 ఫిర్యాదులు
విజయనగరం క్రైమ్: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఎస్పీ వకుల్ జిందల్ సోమవారం తన చాంబర్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఎస్పీ 27 ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను శ్రద్ధగా విన్నారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫిర్యాదుదారుల ముందే వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి అక్కడికక్కడే ఫిర్యాదుదారుల సమస్యలను సంబంధిత అధికారులకు వివరించారు. ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని, ఫిర్యాదుల పరిష్కారానికి చట్టపరిధిలో చర్యలు చేపట్టి, ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని అధికారులను ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, ఏడు రోజుల్లో ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాలను రిపోర్ట్ రూపంలో డీపీఓకు పంపాలని సంబంధిత సిబ్బందిని ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, డీసీఆర్బీ సీఐ బి.సుధాకర్, ఎస్సై రాజేష్, సిబ్బంది పాల్గొన్నారు.

ముగ్గురు అధికారులపై కలెక్టర్ ఆగ్రహం