
పంట, ఆస్తి నష్టంపై ఆరా
● నదీతీర గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్ అంబేడ్కర్
● రూ.280 కోట్లతో 28 చోట్ల కరకట్టల నిర్మాణానికి ప్రతిపాదన
వంగర/రేగిడి: తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు పంట, ఆస్తి నష్టం పరిశీలించేందుకు నదీతీర గ్రామాల్లో కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు. వంగర, రేగిడి మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించి రైతులతో మాట్లాడారు. పంట, ఆస్తినష్టంపై ఆరా తీశారు. నాగావళి, సువర్ణముఖి, వేగావతి నదులతోపాటు జిల్లాలోని ప్రవహిస్తున్న పలు నదుల సమీపంలో గ్రామాలు, పంటపొలాలు రక్షణకు ముంపు నివారణ చర్యల్లో భాగంగా రూ.280 కోట్లతో 28 చోట్ల కరకట్టల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదించామన్నారు. ముందుగా వంగర మండలం మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టును పరిశీలించారు. నీటి నిల్వను అక్కడి అధికారులను అడిగితెలుసుకున్నారు. ప్రాజెక్టులో నిల్వ ఉన్న గుర్రపుడెక్కను డ్రోన్‌ల సహాయంతో గుర్తించి నివారణ మందులు పిచికారీ చేయాలని ఆదేశించారు. భారీ వర్షాలు సమయంలో మత్స్యకారులు వేటకు వెళ్లకుండా హెచ్చరికలు చేయాలన్నారు.
● వంగర మండలంలోని సంకిలి వద్ద నాగావళి పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు. కరకట్టల అవసరాన్ని అధికారులను అడిగితెలుసుకున్నారు. నాగావళి నదిపక్కన కరకట్ట నిర్మించాలని సంకిలి గ్రామానికి చెందిన రైతు నాయకుడు నారు జనార్దనరావు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. నాగావళి నదికి గండికొడితే 11,600 ఎకరాల పంటభూములు ముంపునకు గురవుతాయన్నారు. అనంతరం బొడ్డవలస వద్ద ఉన్న పంపుహౌస్‌ను కలెక్టర్ పరిశీలించి తాగునీటి సరఫరాపై ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను అడిగితెలుసుకున్నారు. కార్యక్రమంలో చీపురుపల్లి ఆర్డీఓ బి.ఆశయ్య, ఇరిగేషన్ ఎస్‌ఈ సుధాకర్‌బాబు, తహసీల్దార్లు బి.రాజశేఖర్, కృష్ణలత, ఎంపీడీఓ ఎస్.రఘునాథాచారి, డీఈ పి.అర్జున్, పలువురు డీఈలు, ఏఈలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

పంట, ఆస్తి నష్టంపై ఆరా