● రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
రామభద్రపురం: పెళ్లయిన మద్దుముచ్చట తీరకుండానే రెండు నెలలకే రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ విషాదకర సంఘటన సోమవారం రామభద్రపురం మండలలోని శిష్టుసీతారాంపురం రహదారిపై జరిగింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శిష్టుసీతారంపురం గ్రామానికి చెందిన వెన్నెల అప్పారావు(31) పని నిమిత్తం ద్విచక్రవాహనంపై రామభద్రపురం మండలకేంద్రానికి వెళ్లాడు. పనిముగించుకుని తిరిగి ఇంటికి వెళ్లిపోతుండగా అధికంగా వర్షం కురవడం వల్ల ద్విచక్రవాహనం అదుపు తప్పి సీతారాంపురం గ్రామం రూట్‌లో రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి అక్కడిక్కడే దుర్మణం చెందాడు. వెంటనే స్థానికులు మృతుడి కుటుంబసభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. భార్య ప్రశాంతికుమారి, కుటుంబ సభ్యులు భోరున విలపించారు.పెళ్లయి రెండు నెలలే అయిందని, ముద్దు, ముచ్చట తీరకుండా వెళ్లిపోయావా? అంటూ వారి రోదన చూసిన ప్రతి ఒక్కరూ కంటతడిపెట్టారు. మృతుడి భార్య ఫిర్యాదుమేరకు ఎస్సై వి.ప్రసాదరావు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.
ఏరియా ఆస్పత్రి కిటకిట
సీతంపేట: విస్తృతంగా వర్షాలు కురుస్తుండడంతో వ్యాధులు కూడా విస్తరిస్తున్నాయి. స్థానిక ఏరియా ఆస్పత్రి సోమవారం రోగులతో కిటకిట లాడింది. జ్వరంతో పాటు వివిధ రోగాల బారిన పడిన వారు ఆస్పత్రికి వస్తున్నారు. మొత్తం ఓపీ 345 మంది రాగా వారిలో జ్వరాలతో బాధపడుతున్న వారు 71 మంది ఉన్నారు. ఇన్‌పేషెంట్లుగా 71 మంది చేరారు. వారందరికీ రక్తపరీక్షలు చేసి వైద్యసేవలు అందిస్తున్నట్లు ఆస్పత్రి సూపరెంటెండెంట్ శ్రీనివాసరావు తెలిపారు.
చెరువులో పడి వ్యక్తి మృతి
గంట్యాడ: మండలంలోని పెదవేమలి గ్రామానికి చెందిన బోదంకి ఎర్నాయుడు (50) గ్రామంలోని వీర సాగరం చెరువులో పడి మృతిచెందాడు. ఎర్నాయుడు పశువులు మేపుతున్న సమయంలో అవి చెరువులోకి దిగడంతో వాటిని తోలేందుకు చెరువు మధ్యలోకి వెళ్లి మునిగిపోయాడు. ఎర్నాయుడు చెరువులో దిగి ఎంత సేపటికీ రాకపోవడంతో స్థానికులు చెరువులో దిగి వెతికి బయటకు తీశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమత్తం విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి పోలీసులు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై డి.సాయికృష్ణ తెలిపారు.
పెళ్లి ముచ్చట తీరకుండానే..!
పెళ్లి ముచ్చట తీరకుండానే..!