గిట్టుబాటు ధర కల్పిస్తాం
రామభద్రపురం: రైతులు పండించిన కూరగాయలకు గిట్టుబాటు ధరల కల్పనకు చర్యలు తీసుకుంటామని మండల ఉద్యానశాఖాధికారి పి.మోహనకృష్ణ, ఏఎంసీ సెక్రటరీ ఈశ్వరరావు అన్నారు. రామభద్రపురం అంతరరాష్ట్ర కూరగాయల మార్కెట్‌లో బెండకాయల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. 15 కిలోల బరువున్న క్రేట్ బెండకాయల ధర గరిష్టంగా రూ.30లకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. కిలో ధర రూ.2 పలకడంతో రైతన్న నష్టపోతున్నారు. కోత, రవాణా ఖర్చులు కూడా రావడం లేదు. ఇదే విషయంపై ‘కిలో బెండకాయలు రూ.2లు’ అనే శీర్షికన ‘సాక్షి’ శుక్రవారం ప్రచురించిన కథనానికి జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ స్పందించారు. రైతులతో మాట్లాడి సమస్యను తెలుసుకోవాలని మార్కెటింగ్ ఏడీ కిరణ్‌కుమార్‌ను ఆదేశించారు. ఆయన సూచనల మేరకు బొబ్బిలి ఏఎంసీ కార్యదర్శి ఈశ్వరరావు, మండల ఉద్యానశాఖాధికారి పి.మోహనకృష్ణ రామభద్రపురం అంతరరాష్ట్ర కూరగాయల మార్కెట్‌లో బెండకాయల సాగు రైతులతో మాట్లాడారు. ఎస్.చింతలవలసలోని ఎస్.సత్యం సాగుచేస్తున్న బెండ పంటను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సమస్యలను రైతును అడిగి తెలుసుకున్నారు. బెండపంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో నష్టపోతున్నామని రైతు ఆవేదన వ్యక్తంచేశాడు. పంటలను రైతు బజారులో గిట్టుబాటు ధరకు విక్రయించేకునే సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. డిమాండ్ ఉన్న మిశ్రమ పంటలు వేసుకోవాలని సూచించారు. ఽఅధిక దిగుబడి వచ్చే 6 నెలల పంట కాలం ఉన్న గ్రాఫ్టెడ్ టమాటా, వంగ పంటలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఎంసీ సూపర్‌వైజర్ చింతల తిరుపతిరావు, వీహెచ్‌ఏలు పాల్గొన్నారు.
బెండసాగు రైతులతో మాట్లాడిన
ఉద్యానశాఖాధికారి
గిట్టుబాటు ధర కల్పిస్తాం


