మహనీయుల జీవితాలను అధ్యయనం చేయాలి
విజయనగరం అర్బన్: మహనీయుల జీవితాలను అధ్యయనం చేసి వారి గొప్పదనాన్ని ప్రతిఒక్కరూ తెలుసుకోవాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోరారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా బసవేశ్వర జయంతిని బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహానుభావుల త్యాగం, గొప్పదనాన్ని ప్రతిఒక్కరూ తెలుసుకొని చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉందన్నారు. దీని కోసం గొప్పవారి జీవిత చరిత్రలను చదవాలన్నారు. మహాత్మా బసవేశ్వరుడు 12వ శతాబ్దంలోనే సామాజిక న్యాయం కోసం పాటుపడ్డారని కొనియాడారు. కార్యక్రమంలో సెట్విజ్ ఇన్‌చార్జి సీఈఓ సోమేశ్వరరావు, డీఆర్‌ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, టూరిజం అధికారి కుమారస్వామి, డీపీఓ టి.వెంకటేశ్వరరావు, జేడీ తారకరామారావు, కలెక్టరేట్ ఏఓ దేవ్‌ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్


