వేతనదారులకు రెండు బీమా పఽథకాలు
విజయనగరం ఫోర్ట్: ఉపాధి హామీ వేతనదారులు దురదృష్టవశాత్తు మరణించినా, ప్రమాదం కారణంగా వైకల్యం సంభవించినా బీమా రక్షణ అందించే రెండు పథకాలు అమలులో ఉన్నట్టు డ్వామా పీడీ ఎస్.శారదాదేవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం కింద 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వేతనదారులు రూ.20 సంవత్సరానికి చెల్లించాలన్నారు. ఈ పథకం కింద ప్రమాదవశాత్తూ మరణించిన, లేదా పూర్తి వైకల్యం కల్గిన వారికి రూ.2లక్షలు పరిహారం పొందగలరన్నారు. పాక్షికంగా వైకల్యం పొందిన వారికి రూ.లక్ష పొందవచ్చునన్నారు. ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన కింద 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు వారు రూ.435 ప్రీమియం ప్రతి సంవత్సరం చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఏ కారణంగా మరణించిన వారి వారసులకు రూ.2 లక్షల పరిహారం అందుతుందన్నారు. ఈ బీమాల కోసం పోస్టాఫీస్ లేదా బ్యాంక్‌లో ఖాతా నమోదు చేసుకోవాలన్నారు. వారి ఆధార్ అనుసంధానం చేయించుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 9849903737 నంబరుకు సంప్రదించాలని సూచించారు.
ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల పంపిణీ
● వేసవి దృష్ట్యా పని వేళల తగ్గింపు : ఎస్పీ
విజయనగరం క్రైమ్ : ఎండ వేడి, తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు ట్రాఫిక్ సిబ్బందికి ఎస్పీ వకుల్ జిందల్ కిట్లను పంపిణీ చేశారు. నగరంలోని పద్మావతీ నగర్‌లో ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో శనివారం మధ్యాహ్నం 18 మంది ట్రాఫిక్ సిబ్బందికి వాటర్ బాటిల్, హేట్, చిన్న బ్యాగ్‌ను ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ వేసవి దృష్ట్యా సిబ్బంది పని వేళలను తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. ఎండ తీవ్రతతో ట్రాఫిక్ సిబ్బంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మీరు సక్రమంగా పని చేస్తే నగరం ప్రశాంతంగా ఉంటుందన్నారు. ఎండ వేడిలో ట్రాఫిక్ సిబ్బంది పడుతున్న ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగించేందుకు పని వేళలను తగ్గించినట్టు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, ట్రాఫిక్ సీఐ సూరినాయుడు, ఎస్‌ఐలు భాస్కర్, రవి, రమణ, నూకరాజు, ఏఎస్‌ఐ రాజు, పీసీలు భాస్కర్, రవి, నాయుడు, కిరణ్ పాల్గొన్నారు. కాగా మొత్తం 80 మందికి కిట్లు అందజేశారు. ప్రముఖ వ్యాపార, సేవా సంస్థలైన గోవిందా జ్యూయల్లరీ,ఽ రోటరీ క్లబ్ వారి సహకారంతో వీటిని పంపిణీ చేశారు.


