వితంతువులందరికీ పింఛన్లు ఇవ్వాలి
సాలూరు: వితంతు పింఛన్ల మంజూరు విషయంలో కూటమి ప్రభుత్వం వ్యత్యాసాలు చూపిస్తుందని, మానవత్వంతో ఆలోచించి అర్హులైన వారందరికీ వెంటనే మంజూరు చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు పీడిక రాజన్నదొర కోరారు. పట్టణంలోని తన స్వగృహంలో విలేకరులతో శనివారం మాట్లాడారు. డిసెంబరు 2023 నుంచి అక్టోబరు 2024 మధ్యలో భర్తకు పింఛన్ అందుతూ మృతి చెందిన సదరు పింఛన్‌దారుల భార్యలు మాత్రమే పింఛన్‌కు దరఖాస్తు చేసుకోవాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. 60 సంవత్సరాల వయసు దాటి పింఛన్ తీసుకుంటున్న భర్త మరణిస్తే వారి భార్యలకు పింఛన్ అందిస్తామంటున్నారని, అంత కంటే చిన్న వయసులో ఉన్న భర్తలు మరణించిన భార్యలకు వితంతు పింఛన్ మంజూరు చేయకపోతే ఆ కుటుంబం పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కనీసం వారికి అమ్మకు వందనం, చేయూత వంటి పథకాలు కూడా నేడు రావడం లేదని వారి కుటుంబ పోషణ ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించి అర్హులైన వితంతువులకు పింఛన్లు మంజూరు చేయాలని కోరారు.
మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర


