
చట్టాలపై స్పష్టమైన అవగాహన ఉండాలి
పార్వతీపురం రూరల్: పోలీస్ శాఖలో విధి నిర్వహణలో ఉన్న ప్రతి ఒక్కరికీ చట్టాలపై స్పష్టమైన అవగాహన ఉండాలని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం అయన జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో పోలీస్ కాన్ఫరెన్సు హాల్‌లో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించి పెండింగ్‌లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులు, మర్డర్, ప్రాపర్టీ, వాహనాలు దొంగతనం, 174 సీఆర్పీఎస్ కేసులు, మిస్సింగ్, చీటింగ్ కేసులు, సైబర్ నేరాలు, ఇతర కేసులపై సమీక్షించారు. పోలీస్‌స్టేషన్లలో నమోదయ్యే కేసుల వివరాలను ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా సీసీటీఎన్‌ఎస్‌లో ఎప్పటికప్పుడు పొందుపరచాలని ఎస్పీ ఈ సందర్భంగా ఆదేశించారు.
కళాశాలలో ర్యాగింగ్ లేకుండా
అవగాహన కల్పించాలి
ఈ నేర సమీక్ష సమావేశంలో ఐజీ కేవీ మోహన్ రావు వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ..జిల్లా పరిధిలో ఉన్న కాలేజీల్లో విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడకుండా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, మహిళా సంబంధిత నేరాలపై ప్రత్యేక శ్రద్ధతో దర్యాప్తు జరపాలని సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా ప్రాంతం ఒడిశా సరిహద్దులో ఉండడం వల్ల రాష్ట్రానికి ఎక్కువ మొత్తంలో గంజాయి అక్కడినుంచి వస్తున్నందున రైల్వే, ఆర్పీఎఫ్ ఫోర్స్‌తో సమన్వయం చేసుకుని విధులు నిర్వర్తించాలని ఐజీ ఆదేశించారు.
ప్రతిభకు పురస్కారం
విధి నిర్వహణలో ప్రతిభ చూపిన పోలీస్ అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలను ఎస్పీ అందజేసి అభినందించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం 2022, 2023వ సంవత్సరంలో విధి నిర్వహణలో ఉత్తమసేవలు అందించిన వారికి గుర్తింపుగా అందజేసిన యాంత్రిక సురక్ష, ఉత్కృష్ట సేవా పతకాలను సిబ్బందికి ఎస్పీ అందజేశారు. సమావేశంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ శాఖ ఉన్నతాధికారులు, సీఐలు, ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డి