
మే 12న పైడితల్లి దేవర మహోత్సవం
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారిని రైల్వేస్టేషన్ వద్దనున్న వనంగుడి నుంచి చదురుగుడికి తీసుకువచ్చే దేవర మహోత్సవాన్ని వచ్చేనెల 12న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఇన్‌చార్జి ఈఓ కేఎన్‌వీడీవీ ప్రసాద్ తెలిపారు. చదురుగుడి వెనుక ఉన్న కార్యాలయంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో ఉత్సవ వివరాలను వెల్లడించారు. 12వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి వనంగుడిలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తామన్నారు. అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని గాడీఖానా, ఎన్‌సీఎస్ రోడ్డు, గంటస్తంభం మీదుగా హుకుంపేటలో ఉన్న అమ్మవారి చదురువద్దకు తీసుకెళ్లి పూజలు చేస్తామని తెలిపారు. అనంతరం రాత్రి 10 గంటల తర్వాత అమ్మవారిని హుకుంపేట నుంచి భాజాభజంత్రీలతో ఊరేగింపుగా తీసుకొచ్చి మంగళవారం వేకువజామున మూడులాంతర్లు వద్ద నున్న చదురుగుడిలో ఆశీనులు చేస్తామన్నారు. అప్పటి నుంచి ఉయ్యాల కంబాల మహోత్సవం వరకు చదురుగుడిలోనే కొలువై భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. తలయారీ రామవరపు చినపైడిరాజు మే 5న సాయంత్రం అమ్మవారికి మనవిచెప్పి ఉత్సవ చాటింపు వేస్తారన్నారు. అనంతరం ఉత్సవ కరపత్రాలను ఆవిష్కరించారు. సమావేశంలో సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, ఆలయ సూపర్ వైజర్ ఏడుకొండలు, తల యారీ చినపైడిరాజు, రమేష్ పట్నాయక్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.
మే 13 నుంచి ఉయ్యాలకంబాల వరకూ చదురుగుడిలోనే అమ్మ దర్శనం
ఉత్సవ వివరాలు వెల్లడించిన ఈఓ ప్రసాద్

మే 12న పైడితల్లి దేవర మహోత్సవం