
వెబ్‌సైట్‌లో స్కూల్ అసిస్టెంట్స్ సీనియారిటీ జాబితా
● 19వ తేదీలోగా అభ్యంతరాల స్వీకరణ
● డీఈఓ యు.మాణిక్యంనాయుడు
విజయనగరం అర్బన్: జిల్లాలోని ప్రధానోపాధ్యాయ గ్రేడ్–2 పదోన్నతి ఖాళీ పోస్టుల భర్తీ కోసం స్కూల్ అసిస్టెంట్ టీచర్ల సీనియారిటీ జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచినట్టు డీఈఓ యు.మాణిక్యంనాయుడు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు పాఠశాల విద్యాశాఖ జోన్–1 పరిధిలోని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ నుంచి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల గ్రేడ్–2 పదోన్నతి కోసం తాత్కాలిక సీనియారిటీ జాబితా విడుదల చేశారన్నారు. జాబితాను ‘ఆర్‌జేడీఎస్‌ఈవీఎస్‌పీ.కాం’ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందని పేర్కొన్నారు. జాబితాపై ఎలాంటి అభ్యంతరాలున్నా ఈ నెల 19వ తేదీలోగా ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు, విశాఖపట్నం కార్యాలయానికి ఆధారాలతో సమర్పించాలని సూచించారు.
రాజ్యాంగంతో సమానత్వం
విజయనగరం క్రైమ్: అంబేడ్కర్ రచించిన రాజ్యాంగంతో అందరికీ సమాన అవకాశాలు సిద్ధిస్తున్నాయని ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. స్థానిక డీపీఓలో ఆంబేడ్కర్ జయంతిని వెనకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో సోమ వారం నిర్వహించారు. అంబేడ్కర్ చిత్రపటా నికి ఎస్పీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీఎస్పీ గోవిందరావు, సీఐ నర్సింహమూర్తి పాల్గొన్నారు.
రేషన్ బియ్యం పంపిణీలో కోత!
బొబ్బిలిరూరల్: మండలంలోని కాశిందొరవలస పంచాయతీ పరిధిలోని కాశిందొరవలస, డొంగురువలస, ఎరకం దొరవలస గిరిజన గ్రామాల్లోని అంత్యోదయ కార్డుదారులకు 35 కేజీలకు రెండు కేజీలు తగ్గించి డీలర్ పంపిణీ చేశాడు. దీనిపై కార్డుదారులు సోమవారం ఆందోళనకు దిగారు. బియ్యం తక్కువగా రావడం వల్లే రెండు కేజీల చొప్పున తగ్గించి ఇచ్చినట్టు డీలర్ లచ్చన్నదొర తెలిపాడు. విషయం తెలుసుకున్న సీఎస్‌డీటీ రెడ్డి సాయికృష్ణ గ్రామానికి చేరుకుని విచారణ జరిపారు. డీలర్‌ను హెచ్చరించి కార్డుదారులకు తగ్గిన బియ్యం మరలా అందజేశారు. గత నెలలో తక్కువ బియ్యం సరఫరా చేయడంతో ఈ నెలకూడా అదే ఇండెంట్ ప్రకారం బియ్యం సరఫరా అయ్యాయని, ఇది తెలియక డీలర్ బియ్యంలో కోత విధించి పంపిణీ చేశారని సీఎస్‌డీటీ తెలిపారు.
కళ్లికోటలో గజరాజులు
కొమరాడ: ఇటీవల జియ్యమ్మవలస మండలంలో సంచరించిన ఏనుగులు పాతదుగ్గి మీదుగా సోమవారం కళ్లికోట గ్రామానికి చేరుకున్నాయి. కళ్లికోట, గారవలస, దుగ్గి గ్రామాల రైతులు రాత్రి సమయంలో పొలాల్లోకి వెళ్లవద్దని అటవీశాఖ సిబ్బంది హెచ్చరికలు జారీ చేశారు. ఏనుగుల గుంపు కనిపిస్తే కవ్వింపు చర్యలకు పాల్పడవద్దన్నారు. ఏనుగుల సంచారంతో జొన్న, కూరగాయల పంటలు నాశనమవుతున్నాయంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం స్పందించి పంటలు కోల్పోయిన రైతులకు పరిహారం అందజేయాలని విజ్ఞప్తిచేస్తున్నారు.