
సిబ్బంది సమస్యల పరిష్కారానికి వెల్ఫేర్ డే
విజయనగరం క్రైమ్: పోలీస్‌శాఖ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రతి శుక్రవారం వెల్ఫేడ్ డే ను నిర్వహిస్తున్నట్లు ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ మేరకు డీపీఒలో ‘వెల్ఫేర్ డే’ను ఎస్పీ నిర్వహించి మాట్లాడుతూ సిబ్బంది ఎదుర్కొంటున్న, ఎదురవుతున్న సమస్యలను విజ్ఙాపనల రూపంలో ఈ వెల్ఫేర్ డే ద్వారా తీసుకుంటున్నట్లు చెప్పారు. వారి సమస్యలు,సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తన చాంబర్‌కు వచ్చిన సిబ్బందిని ప్రత్యేకంగా పిలిపించి వారి సమస్యలను సావధానంగా ఎస్పీ ఆలకించారు. సిబ్బంది చెప్పిన సమస్యలను వారి ముందే ఓ నోట్ బుక్‌లో నోట్ చేసుకున్నారు. వెంటనే అక్కడిక్కడే సూపరింటెండెంట్‌ను తన చాంబర్‌కు పిలిపించుకుని సిబ్బంది ఇచ్చిన విజ్ఙాపనలకు తగిన వివరణలను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైనంత త్వరగా సిబ్బంది సమస్యలకు పరిష్కారానికి తగిన చర్యలు చేపడతానని ఎస్పీ వకుల్ జిందల్ స్పష్టం చేశారు. మొత్తం ఆరుగురు సిబ్బంది వారి సమస్యలను వెల్ఫేర్‌డేలో ఎస్పీకి విన్నవించుకున్నారు.