విజయనగరం ఫోర్ట్: కేంద్ర ప్రభుత్వం రక్తహీనతను నివారించేందుకు ప్రవేశపెట్టిన పథకాలు క్షేత్ర స్థాయిలో సమర్ధంగా అమలుచేస్తుండడంతో రక్తహీనత కేసులు తగ్గుముఖంపట్టాయని కేంద్ర బృందం ప్రతినిధులు డాక్టర్ దృష్టిశర్మ, డాక్టర్ జాస్మిన్ అభిప్రాయపడ్డారు. గత రెండు రోజులుగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రక్తహీనత తగ్గడానికి గల కారణాలపై ఆధ్యయనం చేశారు. సంబంధిత అంశాలను శుక్రవారం సాయంత్రం కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను కలిసి వివరించారు. ఎనిమీయా ముక్త్ భారత్, ఐసీడీఎస్, మధ్యాహ్న భోజన పథకం, ప్రజాపంపిణీ వ్యవస్థ, జాతీయగ్రామీణ జీవనోపాదుల కార్యక్రమాలు రక్తహీనత తగ్గించేందుకు దోహదపడుతున్నాయన్నారు. దేశంలోని ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాంలోని 12 జిల్లాల్లో రక్తహీనత తగ్గుదలకు గల కారణాలపై ఆధ్యయనం చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ జీవన రాణి పాల్గొన్నారు.


