● కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
విజయనగరం అర్బన్: జిల్లాలోని మానాపురం ఆర్‌ఓబీ నిర్మాణం పనుల్లో జాప్యంపై కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. నోటీసు అందిన రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని, లేదంటే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తన చాంబర్‌లో ఆర్‌అండ్‌బీ అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్‌ఓబీ 2021, జూన్ నెలలో ప్రారంభమైందని, ఒప్పందం ప్రకారం జనవరి 2023కు పూర్తిచేయాల్సి ఉండగా, ఇప్పటికే 780 రోజులు ఆలస్యమైందన్నారు. నిర్మాణంలో జాప్యం వల్ల ట్రాఫిక్ సమస్యతోపాటు ప్రజలకు ఇబ్బంది కలుగుతోందని తెలిపారు. ఇంతవరకు 83.56 శాతం పనులు పూర్తయ్యాయని, 56.42 శాతం చెల్లింపులు జరిగాయని తెలిపారు. అగ్రిమెంట్ విలువ రూ.20.8 కోట్లు కాగా రూ.17.268 కోట్ల విలువైన పనులు జరిగాయని, మిగిలిన పనుల విలువ రూ.3.532 కోట్లు వరకు ఉందన్నారు. పనులు పూర్తి చేస్తే నిధులు చెల్లింపునకు ఎలాంటి ఆటంకం లేదన్నారు. ప్రజలకు అత్యవసరమైన వంతెన నిర్మాణంలో అలసత్వం తగదన్నారు. సమావేశంలో ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ కాంతిమతి, ఈఈలు, డీఈలు పాల్గొన్నారు.
తాడి ప్రకాష్‌కు పతంజలి పురస్కారం
విజయనగరం గంటస్తంభం: ప్రముఖ పాత్రికేయుడు, సినీ మాటల రచయిత కె.ఎన్.వై.పతంజలి 73వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన పాత్రికేయుడు, పతంజలితో పాతికేళ్ల పాటు కలిసి పనిచేసిన రచయిత తాడి ప్రకాష్‌కు పతంజలి పురస్కారం అందజేయనున్నట్టు పతంజలి సాంస్కృతిక వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి తెలిపారు. గురజాడ అప్పారావు గృహంలో వేదిక ప్రతినిధులతో కలిసి శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఏటా పతంజలి జయంతి సందర్భంగా ప్రముఖులకు పురస్కారం అందజేస్తున్నామన్నారు. 2025 సంవత్సరానికి గాను తాడి ప్రకాష్‌కు ఈ నెల 29 తేదీన గురుజాడ గ్రంథాలయంలో పురస్కారం ప్రదానం చేస్తామని చెప్పారు. సాహిత్య అభిమానులు, రచయితలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో వేదిక కార్యదర్శి బాబు, లక్ష్మణరావు, పౌరవేదిక ప్రతినిధులు పాల్గొన్నారు.
మానాపురం ఆర్‌ఓబీ కాంట్రాక్టర్‌కు నోటీసులు