దేవుడా.. నా తోడును తీసుకెళ్లిపోయావా...
అయ్యా.. కాపాడండయ్యా.. కొన ఊపిరితో కొట్టుకుంటున్నాడు.. ఆస్పత్రికి తీసుకెళ్లండయ్యా.. ఈయనే నాకు దిక్కయ్యా.. బతికించండయ్యా.. దేవుడా... బస్సు చక్రాలకింద నా తోడును నలిపేశావా.. నా ఐదోతనాన్ని తీసుకెళ్లిపోయావా అంటూ భర్త తలవద్ద కూర్చుని ఓ వృద్ధురాలు రోదిస్తుంటే అక్కడివారిని కన్నీరుపెట్టించింది. కళ్లముందే తనువుచాలించిన భర్తను చూసి బోరున విలపించింది. ఈ హృదయవిదారక ఘటన కొత్తవలస పట్టణంలో శుక్రవారం చోటుచేసుకుంది.
● ఆర్టీసీ బస్సుకింద పడిన వృద్ధుడు మృతి
● కళ్లెదుటే భర్త మృతితో రోదించిన
వృద్ధురాలు
కొత్తవలస:
మండలంలోని నిమ్మలపాలెం గ్రామానికి చెందిన సంపర్తి పెదరాము(67), అప్పలకొండ వృద్ధ దంపతులు ప్రతిరోజు కొత్తవలస మండల కేంద్రంలోని పలు షాపుల ముందు చెత్తను ఊడ్చుతూ, నీళ్లు చల్లి ముగ్గులు పెట్టే పనులు చేస్తారు. షాపుల యజమానులు ఇచ్చిన కొద్దిపాటి పైకంతో జీవనాన్ని సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారు ఉన్నా ఎవరిదారి చూసుకొని వారు వెళ్లిపోయారు. ఇద్దరూ ఒకరికి ఒకరు అన్నట్టు జీవనం సాగిస్తున్నారు. ఎప్పటివలే శుక్రవారం ఉదయాన్నే కొత్తవలస చేరుకున్న దంపతులిద్దరూ షాపుల ముందు పనులు ముగించారు. తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో కొత్తవలస బస్టాప్‌లో బస్సుకోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో ఎస్.కోట డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు వచ్చింది. శక్తిని కూడదీసుకుని బస్సు ఎక్కేందుకు సిద్ధమవుతున్న క్రమంలో బస్సు కాస్తా ముందుకు వెళ్లిపోవడంతో... అప్పటికే కాలువ నిర్మాణం కోసం తవ్విన మట్టిపోగుపై ఉన్న వృద్ధుడు ఒక్కసారి జారిపోయి బస్సు వెనుక చక్రాల కింద పడిపోయాడు. ఆయనపై నుంచి బస్సు వెళ్లడంతో గిలగిలా కొట్టుకుంటూ కన్నుమూశాడు. ఈ ఘటనను పక్కనే ఉన్న భార్య అప్పలకొండ చూసి గట్టిగా కేకేలు వేసింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న భర్తను చూసి కన్నీటిపర్యంతమైంది. క్షణాల్లో భర్త విగతజీవిగా మారడంతో గుండెలవిసేలా రోదించింది. మృతుడి భార్య అప్పలకొండ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణమైన బస్సును పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు సీఐ షణ్ముకరావు తెలిపారు. శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోట సీహెచ్‌సీకి తరలించారు.
● ఊరికి చేర్చే బస్సు కిందే ఊపిరిపోయింది..
షాపుల ముందు చెత్త ఊడ్చే పనులు పూర్తిచేసి ఊరికి చేరుకునేందుకు వేచిచూసిన బస్సు కిందే ఊపిరి పోవడంతో స్థానికులు కన్నీరుపెట్టారు. వృద్ధురాలిని ఓదార్చారు. కొత్తవలస కూడలిలో రైల్వే అండర్ బ్రిడ్జిని ఆనుకొని గోడను అధికారులు నిర్మిస్తున్నారు. ఈ గోడ నిర్మాణానికి కూడలిలోని కొంతభాగాన్ని తవ్వేసి మట్టిని గట్టులావేశారు. ఈ గట్టుపైనే నిల్చొని ప్రయాణికులు బస్సు ఎక్కాల్సిన పరిస్థితి. ప్రమాదవశాత్తు గట్టుపై నుంచే జారిపడిన రాము బస్సు చక్రాల కింద పడడంతో మృతి
చెందాడు.
భర్త రాము మృతదేహం వద్ద రోదిస్తున్న భార్య అప్పలకొండ


