ఆంధ్ర వైద్య కళాశాల అభివృద్ధికి
పూర్వ విద్యార్థుల అండ
రూ.50 కోట్లతో శతాబ్ది భవనం..
రూ.20 కోట్లతో పరిశోధన కేంద్రం
మరో రూ.7.95 కోట్లతో
లెక్చర్ గ్యాలరీల నిర్మాణం
రూ.60 కోట్ల ఎంసీహెచ్ భవనానికీ
ముందుకొచ్చిన అంకానా
సెంటెనరీ బ్లాక్
మహారాణిపేట: ఒకప్పుడు అక్షరాలు దిద్దించి.. వైద్య విద్యలో ఓనమాలు నేర్పి.. ఉన్నత శిఖరాలకు చేర్చిన ఆ విద్యాలయానికి ఇప్పుడు పూర్వ విద్యార్థులు గురుదక్షిణ సమర్పిస్తున్నారు. ప్రపంచ దేశాల్లో స్థిరపడి, వైద్య రంగంలో విశేష గుర్తింపు పొందిన వారంతా తాము ఎదిగిన ఆంధ్ర వైద్య కళాశాల అభివృద్ధికి ఒక్కటవుతున్నారు. చదువుకున్న కళాశాల రుణం తీర్చుకోవాలన్న సంకల్పంతో కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ.. భావితరాల వైద్య విద్యార్థులకు అత్యాధునిక వసతులు కల్పిస్తున్నారు. భవనాలు, పరిశోధన కేంద్రాలు, బోధనా గ్యాలరీల నిర్మాణంతో కళాశాలకు కొత్త రూపునిస్తున్నారు. ఆంధ్రా మెడికల్ కాలేజ్ పూర్వ విద్యార్థుల సంఘం (అంకోసా), అలుమ్నీ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (అంకానా) సమష్టి కృషితో కళాశాల రూపురేఖలు మారుతున్నాయి. ఇప్పటికే రూ.50 కోట్లతో శతాబ్ది పూర్వ విద్యార్థుల భవనం, రూ.20 కోట్లతో అత్యాధునిక క్లినికల్ అండ్ బయోమెడికల్ పరిశోధన కేంద్రం నిర్మించారు. తాజాగా రూ.7.95 కోట్లతో లెక్చర్ గ్యాలరీల నిర్మాణానికి అంకానా ముందుకొచ్చింది. అంతేకాకుండా రూ.60 కోట్లతో మాతా శిశు సంరక్షణ (ఎంసీహెచ్) భవన నిర్మాణానికీ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇలా దాతృత్వాన్ని సేవా దృక్పథంతో మేళవిస్తూ రాష్ట్రంలోనే అత్యంత ప్రాచీన వైద్య కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు బలమైన పునాది వేస్తున్నారు.
రూ.20 కోట్లతో పరిశోధన కేంద్రం
ఆంధ్ర వైద్య కళాశాల శతాబ్ది ఉత్సవాల సందర్భంగా చేపట్టిన క్లినికల్ అండ్ బయోమెడికల్ పరిశోధన కేంద్ర భవన నిర్మాణం పూర్తయింది. అంకానా రూ.20 కోట్లను పూర్తిగా సమకూర్చడంతో కళాశాల, కింగ్ జార్జ్ ఆసుపత్రి ప్రాంగణంలో 20 వేల చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో ఈ భవనం రూపుదిద్దుకుంది. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న ఈ కేంద్రం అందుబాటులోకి వస్తే వైద్య పరిశోధనలకు మరింత ఊతం లభించనుంది. అధ్యాపకులు, పీజీ విద్యార్థులకు అత్యాధునిక పరిశోధన వసతులు అందుబాటులోకి వస్తాయని డీఎంఈ డాక్టర్ విష్ణువర్దన్ తెలిపారు.
రూ.7.95 కోట్లతో లెక్చర్ గ్యాలరీలు
విద్యార్థులకు మెరుగైన బోధనా వసతులు కల్పించేందుకు అంకానా మరో కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు 300 మంది కూర్చునే సామర్థ్యంతో లెక్చర్ గ్యాలరీలు, క్లోక్ రూమ్‌లతో కూడిన మూడు అంతస్తుల భవన నిర్మాణానికి ముందుకొచ్చింది. ఇందుకు రూ.7.95 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. డీఎంఈ నుంచి వచ్చిన ప్రతిపాదనలకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆమోదం తెలిపారు. ఈ భవన నిర్మాణానికి అవసరమైన నిధులను పూర్తిగా తామే సమకూరుస్తామని అంకానా ప్రకటించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీఎస్‌ఎం సంధ్యాదేవి వెల్లడించారు.
చిన్నారుల ప్రాణాలకు తల్లిపాల భరోసా
కేజీహెచ్‌లో నవజాత శిశువుల ఆరోగ్య పరిరక్షణకు కూడా పూర్వ విద్యార్థుల సంస్థలు చేయూతనిస్తున్నాయి. సుమారు రూ.2.30 కోట్లతో సుశేన మదర్స్ మిల్క్ బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అంకానా, సుశేన హెల్త్ ఫౌండేషన్ ప్రధానంగా నిధులు సమకూరుస్తుండగా.. ఆంధ్ర వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం కూడా సహకరిస్తోంది. నెలలు నిండకముందే జన్మించిన శిశువులు, తక్కువ బరువుతో పుట్టిన చిన్నారులు, తీవ్ర అనారోగ్యంతో ఉన్న నవజాత శిశువులకు పరీక్షించి, శుద్ధి చేసిన తల్లిపాలను అందించేందుకు ఈ కేంద్రం ఉపయోగపడనుంది.
రూ.50 కోట్లతో శతాబ్ది భవనం
కళాశాల శతాబ్ది ఉత్సవాల సందర్భంగా రూ.50 కోట్లతో శతాబ్ది పూర్వ విద్యార్థుల భవనాన్ని నిర్మించారు. ఆంధ్ర వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘంతో పాటు పలువురు పూర్వ విద్యార్థులు ఇందుకు సహకరించారు. ప్రస్తుతం ఈ భవనాన్ని సదస్సులు, సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు, అధ్యాపకులు–విద్యార్థుల పరస్పర చర్చలకు వినియోగిస్తున్నారు. ఇలా ఒక్కో అవసరాన్ని గుర్తిస్తూ కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు నిరంతరం అండగా నిలుస్తున్నారు. తమకు విద్యనందించిన సంస్థ రుణం తీర్చుకోవాలన్న తపనతో నిస్వార్థంగా నిధులు సమకూరుస్తున్న అంకానా ప్రతినిధుల దాతృత్వాన్ని ప్రిన్సిపాల్ కొనియాడారు.
రూ.60 కోట్ల ఎంసీహెచ్ భవనానికీ సాయం
మాతా శిశు సంరక్షణ సేవలను మరింత విస్తరించేందుకు రూ.60 కోట్ల అంచనా వ్యయంతో ఎంసీహెచ్ భవన నిర్మాణానికి కూడా అంకానా సానుకూలత వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను సమకూర్చేందుకు సంసిద్ధత తెలిపింది. ఇటీవల భవన నిర్మాణానికి సంబంధించి స్థల పరిశీలన కూడా పూర్తయింది. ప్రస్తుతం ప్రాజెక్టు నిర్మాణంపై సంప్రదింపులు కొనసాగుతున్నాయని కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు.


