విశాఖకు ‘స్వచ్ఛ’ కిరీటం! | - | Sakshi
Sakshi News home page

విశాఖకు ‘స్వచ్ఛ’ కిరీటం!

Nov 12 2026 12:25 AM | Updated on Nov 12 2026 12:25 AM

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో దేశంలోనే నంబర్‌ వన్‌

10 లక్షలకు పైబడిన జనాభా కలిగిన నగరాల కేటగిరీలో ఘనత

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు స్వీకరణ

డాబాగార్డెన్స్‌: స్వచ్ఛతలో విశాఖ తన ప్రత్యేకతను చాటుకుంది. స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2025–26 జాతీయ స్థాయి అవార్డుల్లో జీవీఎంసీ దేశంలోనే ప్రథమ స్థానాన్ని సాధించింది. 10 లక్షలకు పైబడిన జనాభా కలిగిన నగరాల విభాగంలో స్వచ్ఛ షెహర్‌ కేటగిరీలో అగ్రస్థానంలో నిలిచింది. విశాఖ నగర చరిత్రలో తొలిసారిగా ఈ ఘనతను సొంతం చేసుకుంది. దీంతో జాతీయ స్థాయిలో స్వచ్ఛ విశాఖకు గుర్తింపు లభించింది.

రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు

దేశ రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో బుధవారం స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2025–26 అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పి.నారాయణ, ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎస్‌.సురేష్‌కుమార్‌, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌, డైరెక్టర్‌ డాక్టర్‌ పి.సంపత్‌కుమార్‌తో కలిసి ఆయన అవార్డు స్వీకరించారు.

సమష్టి కృషికి దక్కిన గుర్తింపు

విశాఖ నగర చరిత్రలో తొలిసారిగా జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం సాధించడం ఆనందంగా ఉంది. ఈ పురస్కారం జీవీఎంసీకి మాత్రమే దక్కిన గౌరవం కాదు. నగర ప్రజల సమిష్టి విజయం. నగరాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దేందుకు సహకరించిన ప్రజలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, పారిశుధ్య కార్మికులు, అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు. ఎండ, వానలను సైతం లెక్కచేయకుండా రాత్రింబవళ్లు నగర పారిశుధ్య పరిరక్షణకు శ్రమిస్తున్న కార్మికుల సేవలు ఈ విజయానికి ప్రధాన బలం. ఈ పురస్కారాన్ని పారిశుధ్య కార్మికులు, నగర ప్రజల సహకారానికి అంకితం చేస్తున్నాం. జీవీఎంసీకి నిరంతరం సూచనలు, సలహాలు, మార్గదర్శకత్వం అందించిన జిల్లా కలెక్టర్‌, జీవీఎంసీ ప్రత్యేకాధికారి ఎం.అభిషిక్త్‌ కిశోర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. స్వచ్ఛ విశాఖ–సుందర విశాఖ లక్ష్య సాధనకు భవిష్యత్తులోనూ నిరంతరం కృషి చేస్తాం.

–కేతన్‌గార్గ్‌, కమిషనర్‌, జీవీఎంసీ

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న మంత్రి నారాయణ, జీవీఎంసీ

కమిషనర్‌ కేతన్‌గార్గ్‌, స్వచ్ఛ షెహర్‌ విభాగంలో జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన జీవీఎంసీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement